సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేసిన తరవాత ఎటు వైపు వెళ్తారన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో జేడీ కీలకమైన హింట్ ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా ఉన్న ఎన్నార్సీ, ఎన్పీఆర్, సీఏఏల విషయంలో అనుకూలంగా మాట్లాడారు. అచ్చంగా బీజేపీ నేతలు చెప్పే డైలాగులయిన… దేశం ధర్మశాల కాదని అంటున్నారు. దేశ భద్రత చాలా ముఖ్యమని అంటున్నారు. ఇప్పటి వరకూ.. జేడీ ఇలాంటి విషయాలపై బహిరంగంగా స్పందించిన దాఖలాలు తక్కువే. జనసేన బయటకు వచ్చిన తర్వాత.. ఇప్పుడు.. చాలా ఘాటుగాఇలా వ్యాఖ్యానించడం కాస్త ఆసక్తికరమైన విషయంగానే రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
సహజంగా జేడీ లక్ష్మినారాయణ ఆరెస్సెస్ నేపధ్యం నుంచి వచ్చారని చెబుతూంటారు. ఆయన ఆరెస్సెస్ సమావేశాలకు హాజరయిన ఫోటోలు చాలా సార్లు బయటకు వచ్చాయి. ఇటీవలి కాలంలో రామ్ మాధవ్‌తో కలిసి కూడా ఆయన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ తరుణంలో… బీజేపీ విధానం అయిన ఎన్నార్సీ విషయంలో.. ఘాటుగా స్పందించడంతో… దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందని అంచనా వేస్తున్నారు. లక్ష్మినారాయణకు రాజకీయాలపై చాలా ఆసక్తి ఉంది. అందుకే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు. కానీ… సరైన అడుగులు వేయడంలో విఫలమయ్యారు. మరో సారి అలాంటి తప్పు చేయకూడదన్న ఉద్దేశంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
తన లాంటి మాజీ బ్యూరోక్రాట్లు.. జాతీయ పార్టీల్లో ఉంటేనే … ఏదో విధంగా యాక్టివ్ గా ఉండవచ్చని… తన సేవల్ని ఎలాగైనా వాడుకుంటారని అంచనా వేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. లక్ష్మినారాయణకు .. బీజేపీ ఎప్పుడో ఆహ్వానం పలికింది. కానీ గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తే ప్రయోజనం ఉండదని ఆగిపోయినట్లుగా ఉన్నారు. ఈ సారి మాత్రం.. కాస్త సమయం తీసుకుని అయినా .. తన భావజాలానికి తగ్గట్లుగా ఉన్న బీజేపీలో చేరే అవకాశం ఉందని.. ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోందంటున్నారు.