ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ మాజీ జేడీ, జనసేన నేత లక్ష్మినారాయణ ఓ విషయంలో మద్దతు పలికారు. ఆయన చర్యలు బాగున్నాయని.. అవి విజయవంతం కావాలని కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆ చర్య… మద్యనిషేధ ప్రయత్నం. దశల వారీగా మద్య నిషేధం చేస్తానని.. నవరత్నాల హామీల్లో భాగంగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఆ మేరకు.. లైసెన్సులు రద్దు చేశారు. తొలి అడుగుగా.. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇరవై శాతం షాపుల్ని తగ్గించారు. ఇవే..వీవీ లక్ష్మినారాయణను.. ఆకట్టుకున్నాయి. అందుకే.. జగన్మోహన్ రెడ్డి .. తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని… సఫలీకృతమవ్వాలని ఆశిద్దామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జనసేన పార్టీ తరపున విశాఖలో పోటీ చేసిన సమయంలో.. ఆ తర్వాత కూడా.. వైసీపీ .. వీవీ లక్ష్మినారాయణను.. ప్రతీ విషయంలోనూ టార్గెట్ చేసుకునేది. సాక్షి పత్రికలో ఆయనకు అక్రమంగా ఆస్తులు ఉన్నాయని కూడా కథనాలు ప్రచురించారు. విజయసాయిరెడ్డి అయితే.. తనదైన పద్దతిలో అసభ్యంగా.. ట్విట్టర్లో.. విమర్శలు చేసేవారు. కొంత కాలం పాటు స్పందించకపోయినా…. చివరికి.. వీవీ లక్ష్మినారాయణ విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. తనను .. వైసీపీలోకి ఆహ్వానించిన విషయాన్ని కూడా… మాజీ జేడీ బయట పెట్టారు. ఆ తర్వాత లక్ష్మినారాయణ జోలికి.. విజయసాయిరెడ్డి రాలేదు.
వీవీ లక్ష్మినారాయణ… రాజకీయాలను భిన్నంగా చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ కాబట్టి.. ప్రతీ విషయాన్ని వ్యతిరేకించాలన్న భావనలో ఆయన ఉండటం లేదు. మంచి పని చేస్తే… ఎవరైనా అభినందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో జనసేన పార్టీ సిద్దాంతాలతో ఆయన అభిప్రాయాలు సరిపోతున్నాయి. అయితే.. జనసేనలో మాత్రం ఆయన పెద్దగా కనిపించడం లేదు. ఎలాంటి కార్యక్రమం పెట్టినా… వీవీ లక్ష్మినారాయణకు పిలుపు అందడం లేదన్న ప్రచారం జరుగుతోంది. దిండిలో పెట్టిన వర్క్ షాపునకు కూడా.. వీవీ లక్ష్మినారాయణకు సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు.