సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ తన రాజకీయ ఆకాంక్షలతో తొలిసారి అనంతపురం జిల్లా ధర్మవరంలో బహిరంగంగా ప్రకటించారు. అక్కడ చేనేత కార్మికులతో మాట్లాడిన తరవాత రెండు నెలల్లో తన రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని విస్పష్టంగా మీడియాకు తెలిపారు. ఇప్పటి వరకూ.. తాను సమస్యలపై అధ్యయనం చేస్తున్నానని అధ్యయనం.. పూర్తయిన తర్వాతే.. రాజకీయాలా…లేక మరో రంగమా అన్నది నిర్ణయించుకుంటాని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు నేరుగా.. రెండు నెలల్లో రాజకీయ కార్యచరణ ప్రకటిస్తానని చెప్పడంతో… ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయమని తేలిపోయింది.
ఈ ప్రకటనతో పాటు..రాజకీయంగా తన పంథా ఎలా ఉండబోతోందో కూడా లక్ష్మినారాయణ వెల్లడించారు. తక్షణం ధర్మవరం చేనేత కార్మికుల కోసం రూ. వెయ్యి కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాపట్లలో కానీ.. శ్రీకాకుళం పర్యటనలో కానీ…లక్ష్మినారాయణ నేరుగా… ఇలాంటి ప్రకటనలు చేయలేదు. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్లుగా.. లక్ష్మినారాయణ ప్రకటలు చేస్తూండటంతో.. ఆయన పక్కా ప్లాన్‌లోనే ఉన్నారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
రెండు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ పర్యటనలను పూర్తి చేయనున్నారు. ప్రతి జిల్లాలోనూ ప్రధాన సమస్యను గుర్తించి…దానిపై ఓ నివేదిక తయారు చేసి.. తన పార్టీకి మ్యానిఫెస్టోగా ప్రకటించే అవకాశం ఉంది. సీబీఐ జేడీకి ఉన్న ఇమేజ్ ప్రకారం.. వేరే ఏ పార్టీలో చేరినా.. ఆయనపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఏపీలో సారధ్యం వహించడం లేదా సొంతంగా పార్టీ పెట్టడం అనే రెండు ఆప్షన్లపై ఆయన సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొంత మంది బంధువులు, సన్నిహితులను కూడగట్టి.. రాజకీయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎస్కేయూ వీసీగా పని చేస్తూ రాజీనామా చేసిన రాజగోపాల్… లక్ష్మినారాయణ బృందంలో కీలక సభ్యుడు.