ఏపీలో ఎక్కడ చూసినా నాయకుల పర్యటనలు, యాత్రలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార ప్రతిపక్షాలు నవ నిర్మాణ దీక్షలు, పాదయాత్రలు అంటూ హడావుడి చేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రజా పోరాట యాత్ర చేస్తున్నారు. అయితే, వీళ్లందరితోపాటు మరోపక్క సైలెంట్ గా తన పర్యటనలు కొనసాగిస్తూ ఉన్నారు వీవీ లక్ష్మీనారాయణ. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. మత్స్యకార గ్రామాలకి వెళ్లారు. అక్కడి ప్రజలను కలుసుకుని, వారి స్థితిగతులను తెలుసుకున్నారు. గ్రామాల్లో ప్రజల జీవన శైలి ఎలా ఉంటోందనేది తెలుసుకోవడం కోసమే పర్యటనలు చేస్తున్నా అన్నారు.
తాను కొంతమంది రైతులతో మాట్లాడాననీ, పనికి ఆహార పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే బాగుంటుంది చెప్పారన్నారు. ఎందుకంటే, వ్యవసాయ పనులు చేసేందుకు కూలీలు దొరకడం లేదనీ, అందుకే పనికి ఆహారం, వ్యవసాయం అనుసంధానం చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ప్రాంతంలో కొంతమంది కళాకారుల కుటుంబాలను కూడా కలుసుకున్నానని చెప్పారు. ఈ సందర్భంగా మరోసారి తనపై వస్తున్న కథనాల గురించి స్పందించారు. మీడియాతోపాటు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు తానూ చూస్తున్నాను అన్నారు. తనకు గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం అంటే చాలా ఇష్టమైన అంశాలన్నారు. ఈ విషయాలపై పనిచేద్దామని ఎన్.ఐ.ఆర్.డి.లో పనిచేద్దామని అప్లై చేశాననీ, తాను పోలీస్ లో ఉండటం వల్ల గ్రామాభివృద్ధిలో అనుభవం లేదని తిరస్కరించాన్నారు. కాబట్టి, తన మనసుకు నచ్చిన పని చేయడం కోసం పోలీస్ ఉద్యోగం వదిలేశానన్నారు.
అందుకే, ఇప్పుడు తాను గ్రామాల్లో తిరుగుతున్నాననీ, రైతులూ మత్స్యకారులూ కళాకారులను కలుస్తున్నా అన్నారు. వీళ్ల సమస్యలు తెలుసుకుని పరిష్కారాలు ఆలోచించాలన్నారు. సమస్యలతోపాటు పరిష్కారాలు కూడా ప్రభుత్వాలకు తాను తెలియజేస్తా అన్నారు. పరిష్కారాలు ఎవరు సాధించినా ఫర్వాలేదనీ, ప్రస్తుత ప్రభుత్వం చూపిస్తే ఇంకా మంచిదే అని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. నిజానికి, సమస్యలపై అధ్యయనం చేసి.. వాటిని ప్రభుత్వం ముందు ఉంచుతాననీ, దానిపై వచ్చే స్పందన ప్రకారం తన కార్యాచరణ ఉంటుందని ఇదివరకే లక్ష్మీనారాయణ చెప్పారు. ఇప్పుడు కూడా అదే అంటున్నారు. సమస్యలతోపాటు పరిష్కారాలు కూడా తానే చెబుతాననీ చెబుతున్నారు. మరి, తన అధ్యయనం పూర్తి చేసుకుని.. పరిష్కార మార్గాలతో ప్రభుత్వం ముందుకు ఎప్పుడు వెళతారో చూడాలి.