ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత దుస్థితికి ఎవరు కారణం అంటే అందరూ టక్కున కాంగ్రెస్ పార్టీ అని చెపుతారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత కూడా సాగునీరు, విద్యుత్ సంక్షోభం ఎదుర్కోవడానికి కారణం ఎవరూ అంటే అందరూ కాంగ్రెస్ పార్టీవైపే వేలెత్తి చూపిస్తుంటారు. జాతీయ స్థాయిలో అవినీతి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన రాకుండాపోదు. కానీ కాంగ్రెస్ పార్టీని పదేపదే విమర్శించడం తగదని ఆ పార్టీ మాజీ ఎంపి జెడి శీలం అన్నారు. తమ పార్టీ ఏ రాష్ట్రానికి, ప్రజలకి అన్యాయం చేయలేదని అన్నారు. రెండేళ్ళుగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. ఇంకా ఎంతకాలం విమర్శిస్తారు? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తోందని అన్నారు. ఇప్పటికైనా తెదేపా మంత్రులు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానుకొని రాష్ట్రాభివృద్ధి, పరిపాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. విభజన చట్టంలో హామీల అమలుకోసం కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెస్తే బాగుంటుందని సూచించారు.
రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విభజనని అడ్డుకోలేకపోయినా, కనీసం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు గట్టిగా కృషి చేసి ఉండాలి. వారు ఆనాడు రాష్ట్రానికి న్యాయం జరిగేలా చేయగలిగి ఉండి ఉంటే విభజన జరిగినప్పటికీ రాష్ట్ర ప్రజలు వారిని క్షమించి ఉండేవారేమో? కానీ వారిలో కొందరు ముఖ్యమంత్రి పదవికోసం మరికొందరు పిసిసి అధ్యక్ష పదవి కోసం, మరికొందరు సోనియా గాంధీ ప్రాపకం కోసం ప్రాకులాడారు. విభజన చట్టంపై పార్లమెంటులో చర్చ జరుగుతున్నప్పుడు జెడి శీలం లేచి ఏదో మాట్లాడబోతుంటే సోనియా గాంధీ కనుసైగ చేయగానే మారుమాట్లాడకుండా కూర్చోండిపోయారు. ఆ సంగతి ఆయన మరిచిపోయి ఉండవచ్చునేమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు. ఈరోజు రాష్ట్రం ఈ దుస్థితిలో ఉందంటే దానికి కాంగ్రెస్ పార్టీని కాక మరేవారిని నిందించాలి?