సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ నోట మహారాష్ట్ర తరహా రైతుల ఉద్యమం మాట తరచూ వస్తోంది. కర్నూలు జిల్లాలో దీనికి చంద్రబాబు స్పందనను ముడిపెట్టి తొలిసారి మట్లాడారు. తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రైతుల సమస్యలను అధ్యయనం చేస్తున్నానని.. వాటితో ఓ నివేదిక తయారు చేసి… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళతానని సీబీఐ మాజీ జేడీ ప్రకటించారు. తన నివేదికను చంద్రబాబుకు ఇచ్చి పరిష్కరించమని కోరుతానన్నారు. రైతుల సమస్యలపై చంద్రబాబు స్పందన సంతృప్తికరంగా లేకపోతే.. ఉద్యమం చేపడతానని నేరుగా ప్రకటించారు. మహారాష్ట్రలో జరిగిన విధంగా 40 వేల మంది రైతులతో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.
మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం … రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో 50 వేల మంది రైతులు మహా పాదయాత్ర చేశారు. కాళ్లు బొబ్బలెక్కినా..పగిలి బీడు భూమిగా మారినా కూడా వెనుకడుగు వేయకుండా 180 కిలో మీటర్లు లాంగ్ మార్చ్‌లో పాల్గొన్నారు. అది బీజేపీ ప్రభుత్వాన్ని వణికించింది. ఆ స్ఫూర్తితో యాత్ర చేస్తానని.. సీబీఐ మాజీ జేడీ కూడా చెబుతున్నారు. అయితే.. మహారాష్ట్రలో రైతుల ఆగ్రహానికి కారణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో లేవు. అలాంటి పరిస్థితులే ఉంటే.. రాజకీయాలు వేరేలా ఉండేవి. సీబీఐ మాజీ జేడీ తన జిల్లా పర్యటనల్లో.. ఏ ఏ సమస్యలను నివేదికలో చెబుతారోనన్నది ఆసక్తికరంగా మారింది.
వీలైనంత త్వరగా తన జిల్లాల పర్యటనలు పూర్తి చేస్తానని.. లక్ష్మినారాయణ చెబుతున్నారు. బహుశా.. మరో నెల రోజుల్లో ఆయన చంద్రబాబు అపాయింట్మెంట్ అడిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లోకి వస్తారని… లక్ష్మినారాయణపై ఆయన వీఆర్ఎస్ తీసుకున్నప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. తాను వస్తాను.. అని కానీ.. రాను అని కానీ లక్ష్మినారాయణ తేల్చిచెప్పడం లేదు. కానీ రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయన్న విషయాన్ని మాత్రం అప్పుడప్పుడూ బయట పెడుతున్నారు. ప్రజల్లోకి వచ్చిన తొలి మీటింగ్‌లోనే తనకు వ్యవసాయ మంత్రి కావాలని ఉందన్నారు. అప్పుట్నుంచే రైతులే ఎజెండాగా.. ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడు ఉద్యమం అంటున్నారు.