హైదరాబాద్: వరంగల్ లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నిక దగ్గరపడుతున్నకొద్దీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ ఓడిపోతే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా అని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నిన్న వరంగల్లో సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నాయకులు కూడా మొత్తానికి ప్రతిస్పందించారు. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ ఓడిపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. కేసీఆర్ ఇప్పటికైనా ఫాంహౌస్ వదిలి రైతుల సమస్యలపై దృష్టి నిలపాలన్నారు. వరంగల్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ విజయం సాధించటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. కరవు మండలాలు ప్రకటించటంలో ప్రభుత్వం విఫలమైందని జీవన్ రెడ్డి అన్నారు.