హైదరాబాద్: సూపర్ హీరో పాత్రతో మెప్పించిన తన రా.వన్ చిత్రానికి సీక్వెల్ చేస్తానని, దాని పేరును జి.వన్‌గా నిర్ణయించామని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ చెప్పారు. ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ చిత్ర విశేషాలను షారుక్ వివరించారు. రా.వన్ చిత్రానికి దర్శకత్వం వహించిన అనుభవ్ సిన్హాతోనే ఆ చిత్రాన్ని చేస్తామని చెప్పారు. రా.వన్‌కు వీఎఫ్ఎక్స్ తమ సంస్థ రెడ్ చిల్లీస్ సమకూర్చిందని, ఆ చిత్రం తర్వాతి ఈ ఐదేళ్ళలో ఆ సంస్థ టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. వసూళ్ళపరంగా ఆ చిత్రం ఆశించినంత ఆడకపోయినా, మంచి విజయాన్నే సాధించిందని చెప్పారు. ఆ అనుభవంతో సీక్వెల్‌ను ఇంకా మెరుగ్గా తీస్తామని అన్నారు. తమ వీఎఫ్ఎక్స్ సంస్థ తన రాబోయే చిత్రం ‘ఫ్యాన్’కు కూడా అత్యద్భుతమైన వీఎఫ్ఎక్స్ అందించిందని, దీనితో తమ సంస్థ పేరు 20 రెట్లు ఇనుమడిస్తుందని చెప్పారు. రా.వన్ ఆశించినంత విజయం సాధించకపోయినా తాను నిరాశపడలేదని, కొత్త ప్రయత్నాలు చేస్తున్నపుడు అపజయాలకు సిద్ధం కావాలని అన్నారు. రొటీన్ పనులలో విజయం సాధించటం కన్నా కొత్త ప్రయత్నాలు చేసి విఫలమవటం మంచిదని తాను భావిస్తానని షారుక్ చెప్పారు.