హీరో రాజశేఖర్ నటించిన కల్కి చిత్రం ఇటీవల విడుదలైంది. అ! సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసిన సినిమా ఇది. దీనికి కూడా టేకింగ్ పరంగా మంచి ప్రశంసలు వచ్చాయి. కానీ టేకింగ్ మీద వచ్చిన స్థాయిలో ప్రశంసలు కథ మీద రాలేదు. అయితే నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ఒక్క ప్రశ్నకు జీవిత ఇచ్చిన సమాధానం ఆసక్తి గొలిపింది. తాను ఇచ్చిన సమాధానంతో దర్శకత్వ విభాగంలో తాను జోక్యం చేసుకున్నట్లు జీవిత స్వయంగా ఒప్పుకున్నట్లేనా అన్న సందేహం కూడా వచ్చాయి. వివరాల్లోకి వెళితే..
నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో జీవిత ని ఒక విలేకరి అడిగిన ప్రశ్న ఏంటంటే, ” మీరు కల్కి సినిమా దర్శకత్వంలో జోక్యం చేసుకున్నారా? ” అని. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన జీవిత అసహనానికి లోనయ్యారు. అసలు మీరు అడగాల్సిన ప్రశ్న ఇది కాదు అంటూ చిర్రుబుర్రులాడారు. ఈ సినిమా నిర్మాణంలో కూడా తాము భాగం పంచుకున్నాం కాబట్టి, 20 కోట్ల దాకా పెట్టుబడి పెట్టినవారికి సినిమా అవుట్ పుట్ ఎలా వచ్చిందో చూసుకునే హక్కు ఉంటుందని, ఆశించినట్లుగా రాకపోతే సలహాలు ఇచ్చే హక్కు కూడా ఉంటుందని ఆవిడ వివరించారు. మీరు అడగవలసిన ప్రశ్న ఏంటంటే, ఈ సినిమా దర్శకుడికి మీరు ఏమైనా సలాహాలు ఇచ్చారా, ఏ సీన్ గురించి అయినా చర్చలో పాల్గొన్నారా- ఇలా అడగాలి తప్పించి, ” జోక్యం చేసుకున్నారా” అంటూ ఆడకూడదు అని ఆవిడ విలేకరులకు క్లాస్ పీకారు. తాను గతంలో సినిమాలకు దర్శకత్వం కూడా వహించాను అని, తనకు దర్శకత్వం మీద పట్టు ఉందని ఆవిడ గుర్తు చేశారు.
మొత్తానికి ఆవిడ ఇచ్చిన సమాధానంతో అటు విలేకరులకు, ఇటు జనాలకు ఒక క్లారిటీ వచ్చింది. జీవిత ఈ సినిమాకు నిర్మాత కూడా కాబట్టి ఈ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, అవసరమైతే దర్శకుడిని ఒప్పించి కొన్ని సీన్లు మార్పించారని, ఒక్క మాటలో చెప్పాలంటే సలహా అని పేరు పెట్టినా, సూచన అని పేరు పెట్టినా, మొత్తానికి దర్శకత్వ విభాగంలో జీవిత జోక్యం చేసుకున్న మాట వాస్తవమేనని స్పష్టత వచ్చింది.
అయినా ఈ జోక్యం అనేది ఇన్వాల్వ్మెంటా లేక ఇంటర్ఫిరెన్సా అనేది చెప్పగలిగింది ఆ సినిమా దర్శకుడు ఒక్కరే. మరి ఆయన ఏమంటారో చూడాలి.