మా ఎన్నికల కోసం ప్రకాష్ రాజ్ రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. ఎన్నికలు పెట్టాల్సిందేనని అన్ని విధాలుగా ఒత్తిడి తీసుకొచ్చి డేట్స్ ఎనౌన్స్ చేసుకోలిగిన ప్రకాష్ రాజ్ ఇక పోటీ దారులను తగ్గించుకునే ప్రయత్నం చేశారు. అధ్యక్ష బరిలో ఉంటామని ప్రకటించిన హేమ, జీవితా రాజశేఖర్‌లను ప్రకాష్ రాజ్ చర్చలతో ఇతర పదవుల కోసం తమ ప్యానల్లో కలిసేలా చేయగలిగారు. ఈ రోజు కొత్త ప్యానల్‌ను ప్రకటించారు. పాత ప్యానల్లో ఉన్న సాయికుమార్, బండ్లగణేశ్, సన, శ్రీరామ్ ఏడిద ఇప్పుడు లేరు. హేమ ఉపాధ్యక్షురాలి పదవికి.. జీవితా రాజశేఖర్ జనరల్ సెక్రటరీ పదవికి ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేయనున్నారు.
హేమ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆమె మా నుంచి సస్పెండ్ చేస్తారేమో అన్నంతగా ప్రచారం చేశారు కానీ..ఇప్పుడు నేరుగా ప్యానల్లోకే తీసుకోవడం విశేషం. సాయికుమార్, బండ్ల గణేశ్ లను అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. త్వరలోనే అందరితో కలిసి ప్రెస్‌మీట్ పెట్టి తమ ప్యానెల్ ఎజెండా ఏంటి? ఏయేం పనులు చేస్తాం? అన్నీ అప్పుడు వివరిస్తానన్నారు. మొత్తంగా ఐదుగురు అధ్యక్ష బరిలో ఉంటారనుకుంటే ఇందులో ఇద్దరు ప్రకాష్ రాజ్ ప్యానల్లో చేరిపోయారు. తెలంగాణ తరపున పోట చేస్తానంటూ ప్రకటించిన సీవీఎల్ నరసింహారావు ఆ తర్వాత ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
ఇటీవల ఎన్నికల తేదీలు వచ్చిన తర్వాత కూడా ఆయన నుంచి స్పందన లేదు. అయన బరిలో ఉంటారో లేరో చెప్పడం కష్టం. ఇక మంచు విష్ణు మాత్రం బరిలోఉండటం ఖాయంగా కనిపిస్తోంది. మంచువిష్ణు కోసం ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. విందు భేటీలు ఏర్పాటుచేస్తున్నారు. మా కిరీటం కోసం ప్రకాష్ రాజ్ వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ఆసక్తి రేపుతోంది.