మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు గత కొద్ది సంవత్సరాలుగా వివాదాస్పదం అవుతున్నాయి. మొన్నామధ్య శివాజీ రాజా ప్యానెల్ మీద నరేష్, జీవిత రాజశేఖర్ తదితరుల ప్యానెల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే శివాజీ రాజా ఓటమిని మరి పర్సనల్‌గా తీసుకొని, నాగబాబు మీద తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూ చాలా పదునైన విమర్శలు చేశారు. నాగబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ శివాజీ రాజా వ్యాఖ్యానించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు శివాజీరాజా వ్యాఖ్యలను తప్పుపట్టిన జీవిత, నరేష్, భవిష్యత్తులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులెవరూ ఒకరిమీద ఒకరు తిట్టుకోవడానికి మీడియా సమావేశాలు పెట్టుకోకూడదని సూచిస్తూ ఒక వీడియో బైట్ చేశారు. అందులో వీరిద్దరు ప్రస్తావించిన పలు విషయాలు చర్చనీయాంశంగా మారాయి.
శివాజీ రాజా వ్యాఖ్యలు:
గతంలో శివాజీ రాజా ఒక ప్రెస్ మీట్ పెట్టి సంచలనాత్మక విషయాలు మాట్లాడిన విషయం తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నాగబాబు సాధించింది ఏమీ లేదని, నాగబాబు పిల్లికి బిచ్చం పెట్టని వ్యక్తి అని, తనను నాగబాబు చివరి నిమిషంలో వెన్నుపోటు పొడిచాడని తీవ్ర విమర్శలు చేశాడు. అక్కడితో ఆగకుండా, నాగబాబు పై శివాజీ రాజా బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా చూశారు. ఆయన చాలా నెమ్మదిగా నడుస్తాడని, ఇంట్లో నుంచి కారు దగ్గరికి రావడానికి అరగంట పడుతుంది అని, అలాంటి నాగబాబు హైదరాబాద్ నుంచి నరసాపురం వెళ్లి ప్రజలకు ఏం చేస్తాడని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. నాగబాబుకి తాను గిఫ్ట్ ఇస్తానని రాజకీయ విమర్శలు కూడా చేశారు.
అయితే అప్పట్లోనే హైపర్ ఆది లాంటి నాగ బాబు అభిమానులు శివాజీరాజా వ్యాఖ్యలను తప్పుపట్టారు. నాగబాబు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఒక ఆయనకు కిడ్నీ ఆపరేషన్ కోసం 10 లక్షలు ఇచ్చాడని, అంతే కాకుండా ఇంకా ఎంతో మందికి సహాయం చేసాడని, అలాంటి వ్యక్తిని శివాజీరాజా పిల్లికి బిచ్చం పెట్టని వ్యక్తి అంటూ విమర్శించడం సరికాదని అన్నారు. అలాగే గతంలో శివాజీ రాజా గెలవడానికి సహాయం చేసిన నాగబాబుని ఇప్పుడు శివాజీ రాజా విమర్శించడాన్ని వెన్నుపోటు అంటారని హైపర్ ఆది తనదైన శైలిలో అప్పట్లోనే విరుచుకుపడ్డారు.
ఇక పై “మా” సభ్యులు మీడియా లీక్స్ ఇవ్వవద్దన్న నరేష్:
శివాజీరాజా వ్యాఖ్యలపై నరేష్ స్పందించాడు. శివాజీ రాజా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశాడని, తన లాగే “మా ” అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన నాగబాబు పై ఆయన మరీ వ్యక్తిగత విమర్శలు చేయడం సబబు కాదని నరేష్ అన్నారు. నాగబాబు “మా” అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఆర్టిస్ట్ లకు పెన్షన్ విషయంలో చాలా కార్యక్రమాలు చేశారు అని, అలాగే దాదాపు 6 లక్షల రూపాయల విరాళాన్ని అసోసియేషన్‌కు నాగబాబు ఇచ్చారని, అలాంటి వ్యక్తిని పిల్లికి బిచ్చం పెట్టని వ్యక్తి అంటూ శివాజీరాజా విమర్శించడం తగదని నరేష్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా నాగబాబు పై అంగవైకల్యం తరహా వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని శివాజీ రాజా ధోరణిని నరేష్ విమర్శించారు. మన అసోసియేషన్‌లో సభ్యుడైన వ్యక్తిని, గతంలో అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తిని, సాటి నటుడు అని కూడా చూడకుండా ఇలా అంగవైకల్యం వ్యాఖ్యలు చేయడం శివాజీ రాజా కి తగదని నరేష్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఎవరూ కూడా ఒకరినొకరు విమర్శించుకోవడాని కి ప్రెస్ మీట్ లు పెట్టవద్దని, ఏమైనా సమస్యలు ఉంటే మనలో మనం కూర్చుని అంతర్గతంగా పరిష్కరించుకుందాం అని నరేష్ హితవు పలికారు.
అయితే రాజకీయాల పరంగా ఎవరి ఇష్టాలు వారివి అని, రాజకీయ కోణంలో మీరు విమర్శించుకోవడం అనుకుంటే విమర్శించుకోవచ్చని, కానీ అలాంటి విమర్శల కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని వాడుకోవద్దని నరేష్ అన్నారు. తమ వరకు తాము అయితే మెగా ఫ్యామిలీ కి ఎప్పుడు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని, తమకు ఆ అవసరం కూడా లేదని నరేష్ వ్యాఖ్యానించారు.
పాత గొడవలని మనసులో నుంచి తీసి వేద్దాం అన్న జీవిత
మహేష్ చేసిన వ్యాఖ్యలతో జీవిత పూర్తిగా ఏకీభవించారు. ప్రతి ఒక్కరిలోనూ మంచి చెడులు ఉంటాయని, అయితే ప్రతి ఒక్కరు అవతలి వాళ్లు కూడా మంచి పనులు చేసిన విషయం గుర్తుంచుకోవాలని, అందరూ ఒక అసోసియేషన్ గా కలిసి ముందుకు వెళ్దామని, పాత గొడవలన్నీ మనసులో నుంచి తీసి వేద్దామని జీవిత వ్యాఖ్యానించారు. అలాగే అప్పుడెప్పుడో చేసిన వ్యాఖ్యలను పట్టుకొని, ఒక వ్యక్తిని క్రూరులుగా చిత్రీకరించే పద్ధతి కూడా మానుకుందాం అని జీవిత వ్యాఖ్యానించారు. గతంలో మెగా ఫ్యామిలీ మీద తీవ్ర విమర్శలు చేసిన జీవిత ఇప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టుకొని ముందుకు కొనసాగుతాం అన్న అర్థం వచ్చేలా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏది ఏమైనా ఈ వ్యాఖ్యలు శివాజీరాజాని మాత్రమే ఉద్దేశించి తాము చేయడం లేదని, ఇకపై అందరూ ఒకరినొకరు కలుపుకొని వెళుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని మరింత అభివృద్ధి చేద్దామని, పేద ఆర్టిస్టులకు పెన్షన్స్ వంటి మంచి పనులు మరిన్ని చేద్దామని నరేష్ , జీవిత వ్యాఖ్యానించారు