వైసీపీ నుంచి బీజేపీలో చేరారు జీవిత. కరోనా బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురై.. ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రాజశేఖర్ మెడికల్ రెస్ట్‌లో ఉండటంతో… జీవిత ఒక్కరే.. చేరిక కార్యక్రమానికి హాజరయ్యారు. బీజేపీ హైదరాబాద్ కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో ఈ మేరకు… ఆమె పార్టీలో చేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో చాలా మంది నేతలను బీజేపీలో చేర్చుకున్నారు. అలా చేరడానికి వచ్చిన వారిలో జీవిత కూడా ఉన్నారు. బండి సంజయ్.. అందరికీ కండువాలు కప్పారు కానీ.. జీవితకు మాత్రం కప్పలేదు. సిగ్గుపడ్డారో.. మర్చిపోయారో కానీ… ఎంత సేపు చూసినా బండి సంజయ్ పార్టీ కండువా కప్పకపోవడంతో చివరికి తనంతట తానుగా కప్పుకున్నారు. ఆ కండువాతోనే వేదికపై కూర్చున్నారు. ఆ సన్నివేశాన్ని చూసిన వాళ్లు పాపం జీవిత అనుకున్నారు.
నిజానికి జీవిత రాజశేఖర్ లు ఏ పార్టీలో ఉంటారో వాళ్లకే క్లారిటీ ఉండదు. గతంలో కూడా బీజేపీలో చేరారు. జీవితకు కిషన్ రెడ్డి.. సెన్సార్ బోర్డు పదవి ఏదో ఇప్పించారు కూడా. అయితే ఆ తర్వాత మళ్లీ వైసీపీలో చేరారు. మొదటగా వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజారాజ్యం టైంలో వారిపై దాడి జరగడంతో.. మీడియాలో రచ్చ చేశారు. దాంతో వైఎస్ వారిని అభినందించి పార్టీలోకి ఆహ్వానించారు. అంబటి రాంబాబుతో గట్టి సంబంధాలున్నాయని చెప్పి.. వారికి అప్పట్లోనే కండువా కప్పేశారు. తర్వాత వైఎస్ చనిపోయిన తర్వాత… వైసీపీలో చేరారు. జగన్ ఏ దీక్షలు చేపట్టినా అక్కడుకు వెళ్లేవారు. అయితే… వైసీపీ నేతలు జీవితను రమ్మన్నారు కానీ.. రాజశేఖర్ రావొద్దని కోరడంతో ఇద్దరూ వైసీపీకి గుడ్ బైచెప్పారు. విమర్శలు కూడా చేశారు. తర్వాత బీజేపీలో చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీతో సన్నిహితంగా ఉన్నట్లుగా కనిపించారు. కానీ.. టీడీపీ వాళ్లు కండువా కప్పేంత ధైర్యం చేయలేదు.
ఈ లోపు ఎన్నికలకు ముందు.. ఓ మిషన్ లాగా.. సినిమా వాళ్లను చేర్చుకునే క్రమంలో.. మళ్లీ జీవిత రాజశేఖర్‌లకు కండువా కప్పారు. వారు కూడా… జగన్ ను గతంలో అన్న మాటలు మర్చిపోయి… పార్టీలో చేరిపోయి..మళ్లీ పొగడ్తలు ప్రారంభించారు. అయితే.. చాలా మందిలాగే… ఆమెకూ… ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదు. ఏ పదవీ ఇవ్వలేదు. దాంతో… ఇప్పుడు జీవిత తెలంగాణ వైపు చూసుకుంటున్నారు. బీజేపీలో చేరిపోయారు. తెలంగాణలో బీజేపీ ఊపు మీద ఉండటం.. కేంద్రంలోనూ అధికారంలో ఉండటంతో.. ఏదో ఓ ప్రాధాన్యత దక్కుతుందని ఆశ పడుతున్నారు. అయితే.. కండువా వేయడానికే మొహమాటపడిన బండి సంజయ్… పదవి వచ్చేలా సహకరిస్తారంటే… కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే… ఏపీలో జీవిత రాజశేఖర్ పార్టీ వైసీపీ.. తెలంగాణలో బీజేపీ. ఎవరు ప్రాధాన్యం.. పదవి ఇస్తే.. ఆ పార్టీ తరపున మాట్లాడటానికి సిద్ధంగా ఉంటారన్నమాట. రాజకీయాల్లో ఎలా ఉండకూడదో… అనే దానికి సాక్ష్యంగా ఈ సినీ దంపతులు నిలుస్తున్నారు.