నాకూ విలన్గా చేయాలనుంది. అయితే.. హీరోగా హిట్ కొట్టి విలన్ క్యారెక్టర్స్ చేస్తా. లేదంటే ఫ్లాపుల్లో వున్నాను కాబట్టి విలన్గా చేస్తున్నాడంటారు… హీరో రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ’కి ముందు ఇచ్చిన స్టేట్మెంట్!ఆయన కోరుకున్న హిట్ వచ్చేసింది కనుక విలన్ క్యారెక్టర్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వుంటారని చాలామంది ఊహించారు. దీనికి తోడు రాజశేఖర్ కుమార్తె కథానాయికగా పరిచయమవుతున్న ‘2 స్టేట్స్’ ప్రారంభానికి రాజమౌళి రావడంతో.. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆయన రూపొందించే ‘ఆర్ఆర్ఆర్’లో రాజశేఖర్ విలన్గా నటించనున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటిపై రాజశేఖర్ సతీమణి జీవితా రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు. మా ఆయన రాజమౌళి సినిమాలో విలన్గా చేయడం లేదని తెలిపారు. “మా అమ్మాయి సినిమా ప్రారంభోత్సవానికి రాజమౌళిగారిని ఆహ్వానించడానికి కలిశాం. ఆయన బిజీగా వున్నప్పటికీ, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. ఇద్దర్నీ ఒకచోటు చూసేసరికి రాజమౌళిగారి సినిమాలో నా ఆయన నటిస్తున్నాడని అనుకుని వుంటారు” అని జీవిత పేర్కొన్నారు.