ఒకప్పుడు కథానాయికగా పలు హిట్ సినిమాల్లో నటించిన జీవిత, పెళ్లయ్యాక.. దర్శకురాలిగా అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. శేషు, ఎవడైతే నాకేంటి లాంటి సినిమాలు ఆమె దర్శకురాలు. తాజాగా… `శేఖర్` సినిమా కోసం కూడా మెగాఫోన్ పట్టారు. `జోసెఫ్` చిత్రానికి రీమేక్‌గా రూపొందిన `శేఖర్` ఈనెల 20న వస్తోంది. ఈ సందర్భంగా తానెందుకు దర్శకురాలిగా అవతారం ఎత్తాల్సిందో జీవిత చెప్పుకొచ్చారు.
”శేషు.. దర్శకురాలిగా నా మొదటి సినిమా. అది కూడా రీమేకే. ఉన్నది ఉన్నట్టుగా తీయడానికి ఓ దర్శకుడ్ని వెదికాం.చాలామంది వచ్చారు కానీ..ఏవేవో మార్పులు చెప్పేవారు. అలా మార్చి సినిమా తీయడానికి మనసొప్పులేకోలేదు. అంఉదకు నేనే డైరెక్టర్ని అయిపోయా. నిజానికి అప్పుడు నాకు కెమెరా లెన్సులు, యాంగిల్స్ గురించి కూడా తెలీదు. హరి అనుమోలు కెమెరామెన్ గా పనిచేశారు. ఆయన సహకారం వల్లే ఆ సినిమా తీయగలిగా. అప్పటి నుంచీ.. ఒక్కోటీ నేర్చుకుంటూ వచ్చా. నిజానికి నేను యాక్సిడెంట్ దర్శకురాల్ని. `జోసెఫ్` రీమేక్ కోసం కూడా చాలామంది దర్శకుల్ని సంప్రదించాం. కానీ వర్కవుట్ కాలేదు. అందుకే నేనే ఆ బాధ్యత స్వీకరించా” అని చెప్పుకొచ్చారు.
ఈ సినిమాకి భారీ ఓటీటీ ఆఫర్లు వచ్చినా.. జీవిత ఇవ్వలేదని, థియేటర్లోనే రిలీజ్ చేయాలని గట్టిగా పట్టుపట్టారని బయట వార్తలొచ్చాయి. వాటిపై స్పందించారు. ”ఓటీటీ ఆఫర్లు వచ్చిన మాట నిజమే. కానీ మీరన్నట్టు భారీగా రాలేదు. ఆ రేట్లు నచ్చకపోవడం వల్లే.. ఓటీటీకి ఇవ్వలేదు. కోవిడ్ సమయంలో ఓటీటీ రూపంలో మంచి ఆఫర్లు వచ్చేవి. కోవిడ్ తగ్గాక.. ఓటీటీ వాళ్లు కూడా భారీ రేట్లకు కొనడానికి ఒప్పుకోవడం లేదు. సినిమా చూశాకే.. కొంటామంటున్నారు..” అన్నారు జీవిత.