నటిగా ప్రయాణం మొదలెట్టి, ఆ తరవాత దర్శకురాలిగా మారారు జీవిత. మెగాఫోన్ పట్టాక ఆమె కెమెరా ముందుకు రాలేదు. సుదీర్ఘ విరామం తరవాత జీవిత మళ్లీ నటిస్తున్నారు. అందులోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో. రజనీకాంత్ కథానాయకుడిగా `లాల్ సలామ్` అనే చిత్రం రూపుదిద్దుకొంటోంది. రజనీ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఈ సినిమాలో రజనీకాంత్ సోదరి పాత్రలో జీవిత కనిపించనున్నారు. ఈనెల 7న చెన్నైలో కీలకమైన షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సెట్లో జీవిత అడుగుపెట్టబోతున్నారు. ఈ షెడ్యూల్ లో రజనీ, జీవిత మధ్య కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం జీవిత చెన్నైలోనే ఉన్నారు. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. నటనకు దూరమైన జీవిత.. తన ఇద్దరు కూతర్ల కెరీర్‌ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దశలో నటిగా ఆమెకు మళ్లీ అవకాశం రావడం, అది కూడా రజనీకాంత్ సినిమా అవ్వడం… నిజంగా గొప్ప విషయమే. ఈ కొత్త ఇన్నింగ్స్‌కు జీవిత ఎలా శ్రీకారం చుడతారో చూడాలి.