హైదరాబాద్: ఓటుకు నోటు కేసు నిందితులలో ఒకరైన జెరూసలం ముత్తయ్య ఇవాళ ఒక కొత్త విషయాన్ని బయటపెట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులను ఇటీవల కలిపింది తానేనని చెప్పుకొచ్చారు. ఇరు ముఖ్యమంత్రులమధ్య రాజీ చేసినందుకు తనకు ఆనందంగా ఉందని అన్నారు. పోలీసులు, ప్రత్యర్థులనుంచి ఎన్నో ముప్పులు ఉన్నప్పటికీ నాలుగు నెలలనుంచీ అజ్ఞాతంలో ఉండికూడా తాను ఈ పని చేయగలిగానని ముత్తయ్య చెప్పారు.
ఆ ఘనత తనదని చెబుతూనే, నాడు ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను సంప్రదించటానికి తనను పావులాగా వాడుకున్నారంటూ ముత్తయ్య వాపోయారు. తన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసిందని ఆరోపించారు. తనను బెదిరించినందుకు కేసీఆర్ తీహార్ జైల్‌కు, కేటీఆర్ విజయవాడ జైల్‌కు వెళ్ళాల్సివస్తుందని భయపడ్డారని చెప్పారు. అసలు గొడవంతటికీ కారణం స్టీఫెన్సన్ అనికూడా వారు భావించారని అన్నారు. ఈ కేసులో తన తప్పేమీలేదని సుప్రీంకోర్ట్, హైకోర్ట్ కూడా భావించి తనను కాపాడటంకోసం క్వాష్ పిటిషన్‌ను స్వీకరించి తన అరెస్ట్‌పై స్టే ఇచ్చాయని ఒక పత్రికా ప్రకటనలో ముత్తయ్య పేర్కొన్నారు. మొత్తంమీద ముత్తయ్య వ్యవహారమంతా పెద్ద కామెడీగా ఉందనటంలో సందేహం ఏమాత్రం లేదు.