పవన్ కళ్యాణ్ -జేపీ, ఉండవల్లి ఇతరులతో ఏర్పాటుచేసిన నిజ నిర్ధారణ కమిటీ దాదాపు 15 అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేసి గణాంకాలతో శాస్త్రీయంగా నిజాలు నిర్ధారించడానికి ప్రయత్నం చేసింది. జె.ఎఫ్.సి నివేదిక మొత్తం 15 అంశాలలో అధ్యయనం చేసి నాలుగు అంశాలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని వేలెత్తి చూపగా ( https://www.telugu360.com/te/jfc-report-part-one-analysis/ ) మిగిలిన 11 అంశాలలో గణాంకాలు సాక్ష్యాధారాలతో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టింది. వివరాల్లోకి వెళితే..
మొదటిది- ప్రత్యేక హోదా. నివేదిక మొదటి పేజీ ప్రారంభం కావడమే ప్రత్యేక హోదాపై విశ్లేషణతో ప్రారంభమైంది. పార్లమెంటులో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కమిటీ నిర్ధారించింది. అదే సమయం లో “ప్రత్యేక ఇవ్వాల్సిందే” అంటూ పడికట్టు పదాలకి పరిమితం కాకుండా, ప్రత్యేక హోదా ద్వారా రాష్ట్రానికి ఇవ్వాల్సిన అంశాలపై ఖచ్చితమైన సమాచారాన్ని పొందుపరచింది. ప్రత్యేక హోదా ద్వారా రాష్ట్రానికి నాలుగు రకాల సహాయం చేయాలని మించింది సూచించింది. అందులో మొదటిది 90:10 నిష్పత్తిలో “Central Sponsored Schemes” ద్వారా రాష్ట్రానికి సహాయం చేయడం, రెండవది 90:10 నిష్పత్తిలో “EAP (Externally aided projects)” ద్వారా రాష్ట్రానికి సహాయం చేయడం. మూడవది రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు ఇవ్వడం, నాలుగవది మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రానికి సహాయం చేయడం . ఇప్పటిదాకా పలు రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని నినదిస్తున్నప్పటికీ, ప్రత్యేక హోదా ద్వారా ఏమి ఇవ్వాలో కేంద్రానికి అంత స్పష్టంగా సూచించడం ఈ నివేదిక లోనే కనిపిస్తుంది . ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉండటానికి కేంద్రం చెప్పిన రెండు కారణాలు – ఒకటి, 14 వ ఫైనాన్స్ కమీషన్ వద్దని చెప్పిందని; రెండవది, నీతి అయోగ్ వద్దని చెప్పిందని. అయితే కమిటీ నివేదికలో మొదటి కారణం పచ్చి అబద్ధమని తేల్చగా, రెండవ కారణం- ప్రధాని పార్లమెంటులో చేసిన ప్రకటన కంటే నీతి అయోగ్ నిర్ణయానికి కేంద్రం ఎక్కువ విలువ ఇవ్వడం ఏమిటని కమిటీ ప్రశ్నించింది.
ఇక రెండవది- రెవెన్యూ లోటు భర్తీ చేయడం. 2014-15 సంవత్సరానికి గాను మొత్తం రెవిన్యూ లోటు 16078.76 కోట్లుగా నివేదిక తేల్చింది. రెవెన్యూ లోటు భర్తీ చేయకుండా ఉండడానికి కేంద్రం చెప్పిన కారణం – రైతు రుణమాఫీ, వృద్ధాప్య పింఛన్లు వంటి నూతన పథకాల కోసం రాష్ట్రప్రభుత్వం డబ్బు ఖర్చుచేసి ఆ డబ్బుని కేంద్రం ఇవ్వాలని రెవెన్యూ లోటు పేరిట కేంద్రాన్ని కోరడం సమంజసం కాదని, ఆ కారణంతో ఈ రెవిన్యూ లోటు భర్తీ చేయలేమని కేంద్రం చెబుతోంది. అయితే కమిటీ నివేదిక మాత్రం రెవెన్యూ లోటు భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సూచిస్తూ, దీని కోసం కేంద్రం ఇచ్చిన డబ్బు చాలా కొద్ది మొత్తం మాత్రమేనని (4118 కోట్లు) తేల్చిచెప్పింది.
అలాగే జాతీయ సంస్థల ఏర్పాటు కోసం 11673 కోట్లు అవసరం కాగా ఇచ్చింది కేవలం853 కోట్లు అని నివేదిక తేల్చిచెప్పింది.
ఇక విశాఖపట్నం మెట్రో విషయంలో- కేంద్రం వీలైనంత త్వరగా రాష్ట్రానికి మెట్రో ఇవ్వాలని సూచించిన నివేదిక, అది కేవలం విశాఖపట్నం కేంద్రంగానే ఇవ్వాలని మాత్రం ఎక్కడా వ్రాయలేదు. అయితే నివేదికలో పొందుపరచకపోయినప్పటికీ, నివేదిక అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రామ్ విలాస్ పాశ్వాన్ నియోజకవర్గమైన హాజీపూర్ కి రైల్వేజోన్ ఇవ్వడానికి రాని అభ్యంతరాలు కేంద్రానికి విశాఖపట్నం రైల్వేజోన్ విషయంలో మాత్రమే ఎందుకు వస్తున్నాయని చురకలు అంటించారు
ఈ నాలుగు అంశాలతో పాటు మరో ఏడు అంశాల్లో కేంద్రాన్ని నివేదిక దోషిగా నిలబెట్టింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇవ్వవలసిన మొత్తం 24350 కోట్లు కాగా వచ్చింది కేవలం 2110 కోట్లు .అలాగే కడప స్టీల్ ప్లాంట్, కాకినాడ పెట్రో కాంప్లెక్స్, వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్ లాంటి అంశాలన్నింటిలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టింది నివేదిక.
ఇప్పటికే లక్షల కోట్లు ఆంధ్ర ప్రభుత్వానికి, ఆంధ్ర రాష్ట్రానికి, ఇచ్చినట్టుగా చెబుతున్న భారతీయ జనతా పార్టీ పెద్దల గొంతులో పచ్చి వెలక్కాయ పడేలా ఆధారాలు, గణాంకాలతో ఈ నివేదిక నిరూపించినట్టయింది.