Jigra Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.25/5
-అన్వర్-
కెరీర్ బిగినింగ్ నుంచే గ్లామర్ పాత్రలతో పాటు లేడి ఓరియంటెడ్ సినిమాలని బ్యాలెన్స్ చేస్తోంది ఆలియా భట్. హైవే, రాజీ, గంగూబాయ్, డార్లింగ్స్… ఇవన్నీ ఆలియా సోలో సత్తా చాటిన సినిమాలే. ఇప్పుడు ఆమె నుంచి మరో లేడి ఓరియంటెడ్ మూవీగా వచ్చింది ‘జిగ్రా’. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాని కరణ్ జోహార్ నిర్మించారు. సమంత, త్రివిక్రమ్ లాంటి ప్రముఖులు తెలుగు ప్రమోషన్స్ లో భాగం కావడంతో ఇక్కడ కూడా సినిమా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించగలిగింది. మరి యాక్షన్ డ్రామాగా వచ్చిన ‘జిగ్రా’తో ఆలియా మరో సోలో హిట్ కొట్టిందా?
సత్య(ఆలియా భట్), అంకూర్ (వేదాంగ్ రైనా) తోబుట్టువులు. చిన్నప్పుడే అమ్మ చనిపోతుంది. కొన్నాళ్ళకి కళ్ళముందే తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో తమ్ముడు అంకూర్ కి తల్లితండ్రీ అన్నీ తానై పెంచుతుంది సత్య. తనకు పెదనాన్న వరసైన మెథాని ఫ్యామిలీలో స్టాఫ్‌గా వర్క్ చేస్తుంటుంది సత్య. అంకూర్ ఇంజనీర్. తనకో బిజినెస్ ఐడియా వుంటుంది. మెథాని కుటుంబంలోని కబీర్, అంకూర్ ఫ్రెండ్స్. ఫారిన్ నుంచి వచ్చిన కబీర్, అంకూర్ ని కలిసి ఇంట్లో తన ఐడియాని ఒప్పిస్తాడు. ఇద్దరూ కలసి బిజినెస్ ట్రిప్ పై కొరియాలోని హన్షి దావోకి వెళ్తారు. అక్కడ కబీర్ డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడతాడు. ఈ కేసులో అంకూర్ ని కూడా కస్టడీలోకి తీసుకుంటారు పోలీసులు. డ్రగ్స్ కేసులో పట్టుపడితే ఆ దేశంలో ఏకంగా మరణ శిక్షే. కేసులోని తీవ్రత తెలుసుకున్న మెథాని ఫ్యామిలీ కబీర్ ని విడిపించి ఆ కేసులో అంకూర్ ని బుక్ చేసేస్తుంది. మూడు నెలల్లో అంకూర్ కి మరణ శిక్ష అమలు చేయాలని కోర్ట్ ఆదేశాలు ఇస్తుంది. నిర్దోషి అయిన తమ్ముడిని బయటికి తీసుకురావడానికి హన్షి దావోకి వెళుతుంది సత్య. తర్వాత ఏం జరిగింది ? అంకూర్ ని జైలు నుంచి విడిపించగలిగిందా? లేదా? అనేది మిగతా కథ.
జైలు నుంచి తప్పించుకునే కథలకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది ప్రిజన్ బ్రేక్ వెబ్ సిరిస్. ఈ బ్యాక్ డ్రాప్ లో ఏ కథ వచ్చినా ప్రిజన్ బ్రేక్ రిఫరెన్స్ ఎక్కడో చోట కనిపిస్తుంది. జిగ్రా కూడా ఒక విధంగా ప్రిజన్ బ్రేక్ స్ఫూర్తి వున్న కథే. అన్యాయంగా కేసులో ఇరుక్కుని జైలు జీవితం గడుపుతున్న అన్నయ్యని విడిపించడానికి వచ్చే తమ్ముడి కథగా ప్రిజన్ బ్రేక్ కనిపిస్తే.. తమ్ముడి కోసం జైలు గోడలు బద్దలు కొట్టడానికి వచ్చే అక్క కథగా జిగ్రాని చెప్పుకోవాలి. అయితే ప్రిజన్ బ్రేక్ లోని థ్రిల్, ఎక్సయిట్మెంట్ ని జిగ్రా మ్యాచ్ చేయలేకపోయింది.
సత్య, అంకూర్ బాల్యంతో కథ మొదలౌతుంది. పెద్దయ్యాక సత్య పాత్రని పరిచయం చేసిన తీరు, అంకూర్ జైల్లో ఇరుక్కోవడం, సత్య స్పెషల్ ఫ్లయిట్ లో తమ్ముడి దగ్గరికి వచ్చే వేగం చూసినప్పుడు.. గొప్ప యాక్షన్ ఫిల్మ్ చూడబోతున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే అనూహ్యంగా ఈ కథ గ్రాఫ్ డ్రాప్ అయిపోతుంది. సత్య క్యారెక్టర్ క్లూలెస్ గా నడిపిన తీరు, జైలునుంచి బయటికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు ఆవలింతలు తెప్పించేలా వుంటాయి. ఏ థ్రిల్లు లేకుండానే ఇంటర్వెల్ బ్యాంగ్ పడిపోతుంది.
జైలు నుంచి తప్పించుకునే కథలు.. ప్రేక్షకుడి ఇంటెల్జెన్సీకి కిక్ ఇచ్చేలా వుండాలి. జిగ్రాని మాత్రం అక్క తమ్ముడు ఎమోషన్ ఫీల్ అవ్వండనే కోణంలో సాగుతుంది. ఇది మంచి ఎమోషనే కానీ దాన్నే నమ్ముకొని స్లో మోషన్ లో సీన్లు నడపడం అంతగా అతకలేదు. జైలు నుంచి పారిపోవడానికి అంకూర్ చేసే ప్రయత్నాలు, తప్పించడానికి సత్య వేసే ప్లాన్స్ ఆసక్తిని పెంచవు. అయితే క్లైమాక్స్ లో వచ్చే దొమ్మి యాక్షన్ సీక్వెన్స్ మాత్రం వర్క్ అవుట్ అయ్యింది. దాదాపు 20 నిమిషాలు పాటు సాగే ఈ ఘట్టం యాక్షన్ ప్రియులని అలరించేలా వుంటుంది.
అలియా భట్ వన్ విమెన్ షో జిగ్రా. ఆమెపడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. ఆమె నటనకు మంచి మార్కులు పడిపోతాయి. ఆ క్యారెక్టర్ ని ఇంకా కొంచెం బలంగా తీర్చిదిద్దే అవకాశం వుంది. తమ్ముడు పాత్రలో చేసిన వేదాంగ్ రైనా ఆకట్టుకుంటాడు. జైలు నేపధ్యంలో వచ్చే సన్నివేశాల్లో సహజంగా కనిపించాడు. రాహుల్ రవీంద్రన్ మరో కీలక పాత్ర చేశాడు. ఈ తరహ పాత్ర చేయడం ఆయనకి కొత్తే. మనోజ్ పహ్వా క్యారెక్టర్ మొదట్లో నాన్ సింక్ అనిపిస్తుంది కానీ చివర్లో ఆ పాత్రని వాడుకున్న విధానం బావుంది. జైలర్ గా చేసిన నటుడు కర్కశంగా కనిపించాడు. మిగతా పాత్రలు పరిధిమేరకు వున్నాయి.
టెక్నికల్ గా సినిమా ఉన్నంతగా వుంది. కెమరాపనితనం, నేపధ్య సంగీతం బాగా కుదిరాయి. బీజీఎంలో బాలీవుడ్ ఓల్డ్ క్లాసిక్స్ వినిపిస్తుంటాయి. ఆ పాటల నేపధ్యం తెలిస్తే ఇంకాస్త కనెక్ట్ కావచ్చు. జైలు సెటప్ బావుంది. చివరి యాక్షన్ ఎపిసోడ్ ని లావిష్ గా షూట్ చేశారు.
డైరెక్టర్ వాసన్ బాలా యాక్షన్ కంటే ఎమోషన్ కే పెద్దపీట వేశాడు. ఈ ఎమోషన్ అలియా భట్ కి నటించే స్కోప్ ఇచ్చింది కానీ ఓ ఎక్సయిటింగ్ ప్రిజన్ బ్రేక్ లాంటి కంటెంట్ చూద్దామని థియేటర్ లోకి అడుగుపెట్టిన ఆడియన్ ని అంతలా మెప్పించలేకపోయింది.
తెలుగు360 రేటింగ్: 2.25/5
-అన్వర్-