ఓటీటీ ని కల్పతరువు అనుకొనే రోజులకు కాలం చెల్లినట్టే అనిపిస్తోంది. ఇదివరకటిలా… సినిమాల్ని కొనడానికి ఓటీటీలు అంతగా ఉత్సాహం చూపించడం లేదు. ఓటీటీలు మనుగడలో ఉండాలంటే వాళ్లకు కంటెంట్ కావాలి. కంటెంట్ కోసం సినిమాలు కొనాలి. అది తప్పని వ్యవహారం. కాకపోతే… ఇదివరకటిలా సినిమాలకు మంచి రేట్లు గిట్టుబాటు అయ్యే అవకాశాల్లేవు. ఎందుకంటే… ఓటీటీలు సినిమాలు కొనే విషయంలో ఆచి తూచి స్పందిస్తున్నాయి. విడుదలకు ముందే కర్చీఫ్‌లు వేసే రోజులు, స్టార్ హీరోల సినిమాల కోసం ఎగబడిపోయే రోజులు పోయాయి. ఎంత పెద్ద స్టార్ అయినా సినిమా బాగుంటే కొంటున్నాయి. లేదంటే గీచి గీచి బేరం ఆడి, తక్కువ రేటుకి పట్టుకుపోతున్నాయి. దాంతో నిర్మాతలంతా జావగారిపోతున్నారు. ఓటీటీలపై ఆశలు మెల్లమెల్లగా వదులుకొంటున్న తరుణంలో.. ‘జియో’ ఇప్పుడు మరో పిడుగులా తయారైంది.
ఓటీటీ మార్కెట్ ని కబళించడానికి జియో విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. హాట్ స్టార్ త్వరలోనే జియో కైవసం కాబోతోంది. ‘ఆహా’ లాంటి చిన్న చిన్న ఓటీటీ సంస్థలూ జియో హస్తగతం అవ్వబోతున్నాయి. జి 5 కూడా దాదాపుగా జియో చేతుల్లోకి వెళ్లే ఛాన్సుంది. నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ లాంటి సంస్థలు ప్రాంతీయ సినిమాల్ని దాదాపుగా పట్టించుకోవడం మానేశాయి. హాట్ స్టార్, జీ5, ఆహాలు.. చిన్న సినిమాలకు వరంలా మారాయి. ఇప్పుడు ఇవన్నీ జియో నెట్ వర్క్‌గా మారిపోబోతున్నాయి. అంటే.. ఓటీటీ మార్కెట్ ని జియో కబళించేస్తోందన్నమాట. ఇకమీదట జియో చెప్పిందే రేటు. ఆ రేటుకే సినిమాల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ఎలాగూ చిన్న చితకా సినిమాల్ని కొనవు. బడా హీరోల సినిమాలు సైతం వాళ్లకు అంతగా అవసరం లేదు. సో.. జియో గుత్తాధిపత్యం మొదలైతే, నిర్మాతలకు మరిన్ని సంకటాలు రావడం ఖాయం.
తెలుగు చిత్రసీమలోని అగ్ర నిర్మాతలంతా కలిసి ఓ ఓటీటీ సంస్థ ఏర్పాటు చేసే ఆలోచన గతంలో చేశాయి. ఫిల్మ్ ఛాంబర్ కూడా దీనిపై దృష్టి పెట్టింది. కానీ.. ఆ తరవాత దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ అవసరం వచ్చినట్టే కనిపిస్తోంది. జియో గుత్తాధిపత్యానికి లొంగ కుండా ఉండాలంటే ఇలాంటి ఓ ఏర్పాటు అత్యవసరం. దానిపై నిర్మాతలు ఎంత త్వరగా దృష్టిసారిస్తే అంత మంచిది.