రిలయన్స్ జియో ఫ్లాట్ ఫామ్స్ పంట పండుతోంది. ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ ఏమైపోతోందోనని.. అందరూ కంగారు పడుతూంటే.. ముఖేష్ అంబానీ జియో మాత్రం… పెట్టుబడులతో పవర్ ఫుల్‌గా మారుతోంది. ఒక్కశాతం వాటా అమ్మితేనే వేల కోట్లు వచ్చి పడుతున్నాయి. కొత్తగా అమెరికాకు చెందిన ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ రూ.6,598 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇంత పెద్ద మొత్తం పెట్టినందుకు ఆ సంస్థకు వచ్చిన వాటా 1.34 శాతం మాత్రమే. జియో ఫ్లాట్ ఫామ్స్‌కి ఇదే మొదటి పెట్టుబడి కాదు. గత నెల రోజుల్లో ఈ సంస్థకు.. రూ.67,195 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఫేస్బుక్..రూ.43,574 కోట్లతో 9.99శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ డీల్ సంచలనం సృష్టింంచింది.
లాక్ డౌన్ దెబ్బకు కుదలైన ముఖేష్ అంబానీ సంపద ఈ డీల్‌తో అనూహ్యంగా పెరిగిపోయింది. ఆ తర్వాత సిల్వర్ లేక్ పార్టనర్స్ అనే అమెరికా సంస్థ 1.15 శాతం వాటా కొనుగోలుకి రూ. 5650 కోట్లు వెచ్చించింది. ఆ తర్వాత అమెరికాకే చెందిన మరో కంపెనీ విస్టా ఈక్విటీ పార్టనర్స్ 2.32శాతం వాటా కోసం రూ.11, 367కోట్లు వెచ్చించింది. మొత్తంగా 14.8 శాతం జియో ఫ్లాట్ ఫామ్ వాటాలు అమ్మేస్తే..వచ్చిన మొత్తం రూ.67,195 కోట్లు. ప్రస్తుతం జియో ఈక్విటీ వాల్యూ 4.91లక్షల కోట్లు కాగా..ఎంటర్ ప్రైజ్ వాల్యూ 5.16 లక్షల కోట్లు.
నిజానికి దేశంలో టెలికాం రంగం తీవ్రసంక్షోభంలో ఉంది. అయితే..జియో మాత్రమే సంచలనాలు సృష్టిస్తోంది. ఫేస్ బుక్ నేరుగా జియోతో కలిసి వ్యాపారం చేయడానికి పెట్టుబడి పెట్టగా.. మిగతా సంస్థలన్నీ…ఈక్విటీ సంస్థలు.. లాభాల కోసం పెట్టుబడులు పెడుతున్నాయి. పెద్ద మొత్తంలో వాటాలు అమ్మకుండానే వేల కోట్లు పెట్టుబడి రావడంతో జియో వాల్యూ కూడా అంతకంతకూ పెరుగుతోంది.