క్రిష్ చేరిక ముందు వరకూ ఓ విధంగా… క్రిష్ చేరిక తరవాత మరో విధంగా… నందమూరి తారక రామారావు బయోపిక్ ‘యన్.టి.ఆర్’ పనులు జరుగుతున్నాయి. తెలుగు ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ సినిమా బరువు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించలేనని దర్శకుడు తేజ తప్పుకున్నారు. దాంతో ఆ బాధ్యతలను క్రిష్ జాగర్లమూడి చేతిలో పెట్టారు బాలకృష్ణ. క్రిష్ వచ్చీరావడంతోనే అతని మార్క్ మార్పులు, చేర్పులు చేయడం ప్రారంభించారు. నటీనటుల ఎంపికలోనూ ఆయన మార్క్ చూపిస్తున్నారు. అక్కినేని, సావిత్రి పాత్రల్లో ఎవరెవరు కనిపిస్తారు? అని ఓ పక్క చర్చలు జరుగుతున్నాయి. మరోపక్క సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు క్రిష్. మెల్లగా నటీనటుల ఎంపిక పూర్తి చేస్తున్నారు.
ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు ఎల్వీ ప్రసాద్ పాత్రకు హిందీ సినిమాల్లో నటించే బెంగాలీ నటుడు జిష్షు యు సేన్‌గుప్తాను ఎంపిక చేశారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన హిందీ సినిమా ‘మణికర్ణిక’లో ఇతను ఝాన్సీ లక్ష్మీభాయి భర్తగా నటించాడు. ఆ సినిమా విడుదలకు ముందే అతడికి మరో అవకాశం ఇచ్చారు క్రిష్. ‘యన్.టి.ఆర్’ షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందు వారం రోజుల పాటు అతడికి తెలుగు లెర్నింగ్ క్లాసులు ఇప్పించనున్నారు. సౌత్ ఇండస్ట్రీలో అతడికి ఇదే తొలి సినిమా. ఇందులో బసవతారకం పాత్రలో విద్యా బాలన్, చంద్రబాబుగా రానా దగ్గుబాటి, నాదెండ్ల భాస్కరరావు పాత్రలో సచిన్ ఖడేకర్ నటించనున్నట్టు జిష్షు సేన్‌గుప్తా కన్ఫర్మ్ చేశాడు.