‘ఉయ్యాల జంపాల’తో ఆకట్టుకొన్న దర్శకుడు విరించి వర్మ. ఆ సినిమా సూపర్ హిట్టయ్యింది. రాజ్ తరుణ్ కు హీరోగా బ్రేక్ దొరికింది. ఆ తరవాత నానితో తీసిన ‘మజ్ను’ కూడా ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీనే. రెండు క్లాస్ టచ్ ఉన్న సినిమాలు తీసిన విరించి వర్మ ఆ తరవాత కనిపించకుండా పోయాడు. ఇప్పుడు ఓ సినిమాతో వచ్చాడు. అదే… ‘జితేందర్ రెడ్డి’. ‘ఎవరికీ చెప్పొద్దు’ సినిమాతో ఆకట్టుకొన్న రాకేష్ వర్రె కథానాయకుడిగా నటించారు. ఇదో పిరియాడికల్ డ్రామా. 1980లలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవలే గ్లింప్స్ విడుదలైంది. ఇందులో యాక్షన్ కు పెద్ద పీట వేశారు. ఆ షాట్స్, ఎమోషన్స్, క్యారెక్టరైజేషన్స్ చూస్తుంటే.. విరించి వర్మలో ఇంత మాస్ ఉందా అనిపిస్తోంది. జితేందర్ రెడ్డి అనేది ఓరకంగా బయోపిక్. ఓ వ్యక్తి విజయ గాథ ఈ చిత్రం. దీన్ని ఓ షార్ట్ ఫిల్మ్‌గా తీద్దామనుకొన్నార్ట. ఆ తరవాత ఓ వ్యక్తి జీవితం చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ద్వారా అర్థం కాదన్న నిర్ణయానికి వచ్చి, సినిమాగా మార్చారు. వాస్తవిక దృక్పథంలో సాగే బయోపిక్స్‌కు మంచి ఆదరణ ఉంది. పైగా ‘జితేందర్ రెడ్డి’లో ఉద్యమకోణం, కమ్యునిస్ట్ భావజాలం కనిపిస్తోంది. కొత్త తరహా సినిమాలు ఇష్టపడేవాళ్లకు ‘జితేందర్ రెడ్డి’ నచ్చే అవకాశం ఉంది. ఈసినిమాతో… విరించి వర్మ తనపై ఉన్న క్లాస్ ముద్రని చెరిపేసుకొంటాడేమో చూడాలి. షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దం అవుతోంది.