Jithender Reddy Movie review
తెలుగు360 రేటింగ్ : 2.5/5
ప్రముఖల జీవితాలు బయోపిక్స్ గా తెరపైకి వస్తున్నాయి. అయితే కొందరి కథలు ప్రజా బాహుళ్యంలో పెద్దగా వుండడు. ‘జితేందర్ రెడ్డి’ది కూడా అలాంటి కథే. అందులోనూ ఈ జనరేషన్ లో చాలామందికి ఆయన కథ గురించి పరిచయం తక్కువ. గూగుల్ లో కూడా పెద్ద సమాచారం లేదు. ఈ సినిమా దర్శకుడు విరించి వర్మ కూడా నిర్మాత ఇచ్చిన సమాచారం మేరకే ఈ కథని తయారు చేసుకున్నాడట. రివ్యూలోకి వెళ్ళే ముందు అసలు జితేందర్ రెడ్డి ఎవరో, అతని నేపధ్యం ఏమిటో తెలుసుకుంటే ఈ జీవితకథ పరిచయం చేసినట్లుగా వుంటుంది.
*1980 -90 మధ్య నక్సలైట్లు తమ సిద్ధాంతానికి వ్యతిరేకమని 40 మందికి పైగా జాతీయవాదులైన కార్యకర్తలను హతమార్చారు. ఏప్రిల్ 9, 1987 నాడు తన స్వగ్రామం మ్యాడంపల్లి నుంచి జగిత్యాల వెళుతున్న జితేందర్ రెడ్డి పై నక్సలైట్లు దాడి చేసారు. గన్ మెన్ గట్టయ్య పారిపోయాడు. జితేందర్ రెడ్డి ఒంటరిగా 2 గంటల పైగా వీరోచితంగా పోరాడి వీర మరణం చెందాడు. విరిగిన చెట్లు పగిలిన రాళ్ళతో ఆ ప్రాంతం యుద్దభూమిని తలపించింది. జితేందర్ రెడ్డి శరీరం నుండి 72 బుల్లెట్లు లభించాయి” జితేందర్ రెడ్డి గురించి సినీరూపక్తలు సినిమాలో క్లుప్తంగా ఇచ్చిన కథనం ఇది.
కథలోకి వెళితే.. జగిత్యాలకు చెందిన జితేందర్ రెడ్డి (రాకేష్ వర్రే) చిన్నప్పటి నుంచి జాతీయవాద భావాలు కలిగిన కుర్రాడు. తనది స్థితిమంతులు కుటుంబం. అదే వూర్లో వుండే భూమక్క కొడుకు అనుకోని పరిస్థితిలో నక్సల్ లో చేరుతాడు. అయితే మనసు మార్చుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. ఓ అర్ధరాత్రి నక్సల్ ఇంట్లో చొరబడి భూమక్క కొడుకుని నిర్దాక్షణంగా కాల్చి చంపేస్తారు. ఈ ఘటన జితేందర్ రెడ్డిని తీవ్రంగా కలిచివేస్తుంది. నక్సల్ ఉద్యమం దారితప్పిందని, నక్సల్ భావజాలం దేశానికి చేటని అప్పుడే నిర్ణయించుకుంటాడు. అదే ఊర్లో గోపన్న (సుబ్బరాజ్ )జాతీయవాది. అతని స్ఫూర్తితో ఏబీవీపీ లో చేరుతాడు జితేందర్. అక్కడ స్టూడెంట్ నాయకుడిగా గెలుస్తాడు. గోపన్న మాటలు కారణంగా ఆ ప్రాంతంలో ప్రజలు నక్సల్ కి దూరంగా జరుగుతారు. వారికి సహాయ నిరాకరణ చేస్తారు. గోపన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున రైతు ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమంలో గోపన్న విజయం సాధిస్తాడు. రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. గోపన్న రాజకీయాల్లోకి వస్తే తమ ఉనికికే ప్రమాదమని భావించిన నక్సల్ .. మాటువేసి గోపన్నతో పాటు రామన్న అనే మరో నాయకుడిని దారుణంగా హతమారుస్తారు. ఈ హత్యలతో రగిలిపోయిన జితేందర్ రెడ్డి, నక్సల్ పై ఎలాంటి పోరాటం చేశాడు? వన్ మ్యాన్ ఆర్మీగా ఒక ఉద్యమాన్నే ఎలా ఎదురుకున్నాడు? అనేది మిగతా కథ.
బయోపిక్స్ రెండు రకాలు. జీవితాన్ని డాక్యుమెంట్ చేయడం. మరొకటి జీవితంలోని ఎదో ఒక పాయింట్ ని తీసుకోని దానికి కొంత సినిమాటిక్ లిబార్టీ జోడించి కమర్షియల్ గా చెప్పడం. ఆడియన్స్ ఎట్రాక్ట్ అయ్యేది కూడా ఈ రెండో రకం ట్రీట్మెంట్ కే. జితేందర్ రెడ్డి జీవితంలో కూడా అలాంటి ఒక కమర్షియల్ హీరోయిక్ పాయింట్ వుంది. ఒక మనిషి, ఏకంగా నక్సల్ ఉద్యమానికే ఛాలెంజ్ గా నిలబడి ఒకొక్కడిని ఏరిపారేయడం నిజంగా మాంచి కమర్షియల్ ఎలిమెంట్. అయితే సినిమా దర్శకుడు విరించి వర్మ.. జితేందర్ రెడ్డి జీవితం మొత్తాన్ని డాక్యుమెంట్ చేయడానికే మొగ్గు చూపాడు. దీంతో సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ లో ఘాడత తగ్గింది.
గన్ మెన్ గట్టయ్య కూతురు జితేందర్ రెడ్డి గురించి రాసిన డైరీని చదివే క్రమంలో ఈ కథ ముందుకు సాగుతుంది. జితేందర్ రెడ్డి బాల్యం, తన కుటుంబం, నక్సల్ దురాగతం, గోపన్న ఇచ్చే స్ఫూర్తి.. ఇలా ఒక పేజ్ ఆర్డర్ లో ఒకొక్క సీన్ ముందుకు ముందుకు కదులుతుంది. కాలేజ్ డేస్ లో వచ్చే లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ మధ్య ఘర్షణని కాస్త సాగ దీసేశారు. ఏం చెప్పదలచుకున్నారో ప్రేక్షకులకి ఒక అంచనా వచ్చిన తర్వాత ఆ పోర్షన్ ని వీలైనంత షార్ఫ్ గా చూపాల్సింది. తమ భావజాలాన్ని హైలెట్ చేసే క్రమంలో కొంత ఏకపక్ష ధోరణి కూడా గమనించవచ్చు. జితేందర్ రెడ్డి పై లెఫ్ట్ వింగ్ స్టూడెంట్స్ చేసిన ఎటాక్ మాత్రం ఇంటెన్స్ గా తీశారు.
గోపన్న రామన్న క్యారెక్టర్స్ తో ఈ కథలో అసలు సంఘర్షణ వస్తుంది. వాళ్ళ హత్యల తర్వాత జితేందర్ రెడ్డిలోని నాయకుడు మరో స్థాయిలో కనిపిస్తాడు. నక్సల్ ఏరివేతకు ఆయన చూపిన తెగువ ఆసక్తికరంగానే వుంటుంది. నిజానికి ఈ కాన్ఫ్లిక్ట్ మీద దర్శకుడు ఇంకా బలంగా వర్క్ చేసి వుంటే బావుండేది. వాళ్ళ మధ్య ఎలాంటి పోరాటాలు జరిగాయో, వాళ్ళని ఎదుర్కోవడానికి ఎలాంటి సన్నాహాలు చేసుకున్నాడో.. ఇంకాస్త రీసెర్చ్ చేసి వుంటే బెటర్ గా వుండేది. జితేందర్ రెడ్డి రాజకీయ ప్రయణం కూడా రొటీన్ గా వుంటుంది. అయితే ఆ కాలంలో ఓటర్లు మైండ్ సెట్ ఏమిటి ? దొరలు ఎలాంటి పాత్ర పోషించేవారు? కొత్తగా వచ్చిన ‘నా దేశం పార్టీ’ ప్రస్తావన ఏమిటి ? ఇలాంటి కోణాలు చూడొచ్చు. క్లై మాక్స్ ఫైట్ సీక్వెన్స్ ని మాత్రం పక్కాగా తీశారు. కథకు ఒక ఎమోషనల్ ఎండింగ్ ఇవ్వగలిగారు.
జితేందర్ రెడ్డి స్వతహాగా ఎలాంటి మనిషో, ఎలా వుండేవారో తెలీదు కానీ దర్శకుడు ఆ పాత్రని చాలా సీరియస్ గా చూపించాడు. రాకేశ్ ఆ పాత్రలో హుందాగా కనిపించాడు. అయితే సినిమా అంతా ఒకటే ఎక్స్ ప్రెషన్ కంటిన్యూ అవుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. క్లైమాక్స్ లో మాత్రం ఆ పాత్ర కట్టిపడేస్తుంది. గొప్పన్న గా చేసిన సుబ్బరాజ్ ది కూడా కీలకమైన పాత్రే. ఆయనకి ఇది కొత్త పాత్ర. గన్ మ్యాన్ గా గట్టయ్య ( రవి ప్రకాష్)ది కథని నడిపే పాత్ర. దొర పాత్రలో బలగం తాత కొత్తగా కనిపిస్తాడు. చాలామంది కొత్తనటీనలు కనిపిస్తారు. ఆ పాత్రలకు కుదిరారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాత్ర కూడా ఓ సన్నివేశంలో కనిపిస్తుంది. ‘నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్’ అనే ఎన్టీఆర్ మాట ప్రస్తావన వుంది. ఆ పాత్ర చేసిన నటుడి ఆహార్యం ఓకే అనిపిస్తుంది. వాజ్ పే గా చేసిన నటుడు మాత్రం నోటి మాట రాలేదు. పెదవులు కదలకుండానే మాటలు వినిపిస్తాయి.
గోపిసుందర్ నేపధ్య సంగీతం కొన్ని చోట్ల మెరిసింది. చివర్లో వచ్చే పాట కదిలించేలా వుంటుంది. 1980 -90 కాలాన్ని రిక్రియేట్ చేసేలా ఆర్ట్ వర్క్ వుంది. జ్ఞాన శేఖర్ కెమరాపనితనం డీసెంట్ గా వుంది. జితేందర్ రెడ్డి జీవితంలోని కీలక ఘట్టాలని వరుస క్రమంలో చరిత్ర పాఠంలా చూపించిన సినిమా ఇది. అ చరిత్ర, ఆ నాటి సంఘటనల మీద ఆసక్తి వున్న వారికి నచ్చే అవకాశం వుంది.
తెలుగు360 రేటింగ్ : 2.5/5