జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో ఆయన స్థానంలో మరొకరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకొనేందుకు అధికార పిడిపి, బీజేపీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. పిడిపి, బీజేపీలు కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వానికి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ (79) గత ఏడాది మార్చి 1వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన అనారోగ్యానికి గురవడంతో డిశంబర్ 24వ తేదీన డిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ నానాటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూనే ఉంది. గత కొన్ని రోజులుగా ఆయనకు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన కోలుకొనే అవకాశాలు లేవని వైద్యులు చెప్పడంతో ఆయన స్థానంలో మరొకరిని ముఖ్యమంత్రి ఎన్నుకొనేందుకు పిడిపి, బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు.
ఆ రెండు పార్టీల మధ్య పొత్తులు కుదిర్చి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ బీజేపీ తరపున ఈ చర్చలలో పాల్గొంటున్నారు. పిడిపి తరపున ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి డా. హసీబ్ ద్రబు, జమ్మూ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సిలర్ అమితాభ్ మతూ పాల్గొంటున్నారు. ఆయన కుమార్తె మహబూబా ముఫ్తీ సయీద్ ముఖ్యమంత్రి పదవి చేపట్టదలిస్తే తమకు ఎటువంటి అభ్యంతఃరం లేదని బీజేపీ స్పష్టం చేసింది. కానీ ఆమెను కాక వేరేవరినయినా ముఖ్యమంత్రిని చేయాలంటే అందుకు తమ అనుమతి తప్పనిసరి అని బీజేపీ నేతలు చెప్పారు. బహుశః నేడో రేపో ముఫ్తీ మొహమ్మద్ సయీద్ స్థానంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటించే అవకాశం ఉంది.
తాజా సమాచారం: ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఈరోజు తెల్లవారు జామున మృతి చెందారు.