సయ్యద్ అలీ షా గిలానీ… ఈ పేరు వినని వారుండరు. కరుడుగట్టిన కాశ్మీరీ వేర్పాటువాది. ఆయనకి జ్వరం వస్తే విమానంలో డిల్లీలో వాలిపోయి ఎయిమ్స్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకొంటారు. గుండెపోటు వస్తే ఎయిమ్స్ ఆసుపత్రికే పరిగెత్తుకొని వస్తారు. కానీ అయన మనసులో మాత్రం భారత్ పట్ల ద్వేషంతో నిండిపోయింది. అందుకే కాశ్మీర్ లో జరిగే ప్రతీ అల్లర్ల వెనుక ఆయన హస్తం తప్పకుండా ఉంటుంది. కాశ్మీరులో వేర్పాటువాదుల సభలలో ఆయన ప్రసంగం తప్పనిసరి…దానిలో ప్రతీ ముక్కలో భారత్ పట్ల తీవ్ర ఏహ్యత, వ్యతిరేకత..పాకిస్తాన్ పట్ల భక్తి ఉట్టిపడుతుంటుంది.
ఇటీవల హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ కి నిరసనగా కాశ్మీరులో జరిగిన ఆందోళనల వెనుక ఆయన కృషి చాలా ఉంది. రాష్ట్రంలో వేర్పాటువాదులకి, ఉగ్రవాదులకి మద్య ఉండే సన్నటి గీతని చేరిపేయాలని ఆయన చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు కానీ సాధ్యపడటం లేదు. ఇటీవల కాశ్మీరులో జరిగిన అల్లర్లలో సుమారు 50మంది మృతి చెందారు. సుమారు 2,000 మంది గాయపడ్డారు. కానీ ఇంకా ఆయనకి తృప్తి కలిగినట్లు లేదు. మళ్ళీ నిన్న కాశ్మీరులో గోడల మీద “ఇండియా గో బ్యాక్” అంటూ నినాదాలు వ్రాశారు. దానితో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
వేర్పాటువాదుల పట్ల చాలా సానుభూతి చూపే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీకి, ఇటీవల కాశ్మీరులో జరిగిన అల్లర్లతో జ్ఞానోదయం అయిందో లేక శ్మశాన వైరాగ్యం..ప్రసూతీ వైరాగ్యం అన్నట్లుగా కాశ్మీర్ అల్లర్ల వైరాగ్యం ఏర్పడిందో తెలియదు కానీ ఆమె బారాముల్లా జిల్లాలో నిన్న పర్యటించినప్పుడు వేర్పాటువాదులని గట్టిగా మందలించినట్లు వార్తలు వచ్చాయి. వాళ్ళు కాశ్మీర్ ని మరో సిరియాలాగ మార్చాలని ప్రయత్నిస్తే తాను చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. యువతకి విద్యా, ఉపాధి కోసం పోరాడకుండా, వేర్పాటువాదం వైపు ప్రోత్సహించడం ఏమిటని గట్టిగా నిలదీశారు. ఆమె నిజంగా వారిని మందలించి ఉంటే ఆమె ముఖ్యమంత్రి పదవికి రోజులు దగ్గర పడినట్లే. ఆమెని ఆ కుర్చీలో నుంచి దింపేసే వరకు వేర్పాటువాదులు ఊరుకోరు. ఏమైనప్పటికీ ఒక జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మొట్ట మొదటిసారిగా వేర్పాటువాదానికి వ్యతిరేకంగా మాట్లాడటం చాలా గొప్ప విషయమే.కానీ ఆమెలో ఆ నిలకడ ఎన్నాళ్ళు నిలిచి ఉంటుందో చూడాలి.