నా కుమారుడు దేశద్రోహి కాదు. లక్షలాది మంది యువకుల లాగే దేశభక్తుడు అతనెందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించాడు పోలీసుల కస్టడీలో వున్న జెఎన్‌యు విద్యార్థి సంఘ అద్యక్షుడు కన్హియ కుమార్ తండ్రి జైశంకర్ సింగ్. తల్లి మీరాదేవి కూడా అదే అంటున్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో అలజడి చల్లారకముందే ఇప్పుడు జెఎన్‌యు జైలువాడలా మారిపోయిందని విద్యార్థులు అధ్యాపకులు నిరసిస్తున్నారు.
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పోలీసుల వేట, విద్యార్థి నాయకులపై అరెస్టులు, కేసుల వేటు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం కోరి కోరి వ్యతిరేకత కొని తెచ్చుకుంటున్నట్టు అర్థమవుతుంది. సరళీకరణ విధానాల నేపథ్యంలో ఇటీవలి రోజులలో కాస్త స్తబ్దుగా వుంటున్న విద్యార్థి ఉద్యమాలు వూపందుకోవడానికి పాలకులే కారకులవడం ఆసక్తికరం. ఎవరి పొరబాట్లు ఏవైనప్పటికీ ఎబివిపి ఫిర్యాదులు చేస్తే కేంద్రం వెంటనే రంగ ప్రవేశం చేయడం సాక్షాత్తూ హౌం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటివారే విద్యార్థి వివాదాలలో తలదూర్చడం ఆశ్యర్యం కలిగిస్తుంది. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో పరిస్థితిని అనేక విధాల పోలి వున్న జెఎన్‌యు వ్యవహారంలో కేంద్రం ప్రత్యక్ష జోక్యం పోలీసుల బెదిరింపులు మరింత అభ్యంతర కరంగా వున్నాయి. ఫిబ్రవరి 10న ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో అఫ్జల్‌గురు, మక్బుల్భట్ల ఉరితీతపై సభ జరిపి భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు ఇచ్చారన్నది ఆరోపణ. దానికి అంతకు ముందు యూనివర్సిటీ ఆవరణలో జరిగిన ఉత్సవానికి లింకు పెట్టారు అధినేతలు అధికారులు. ఇందుకు గాను దేశద్రోహ నేరం(124 ఎ,120 బి,34 సెక్షన్లు) ఆరోపించి జెఎన్‌యు విద్యార్థియూనియన్ అద్యక్షుడు ఎఎస్ఎప్కు చెందిన కన్హయ కుమార్‌ను మరో ఏడుగురిని అరెస్టు చేశారు. నిజంగాఅక్కడ ఏం జరిగింది, ఎవరు నినాదాలిచ్చారు అని చెప్పే సాక్ష్యాధారాలు స్పష్టంగా లేవు. వామపక్ష విద్యార్థి నాయకులకు అలా దేశ విచ్చిన్నకులను ప్రోత్సహించే అలవాటూ లేదు. పంజాబ్‌లో సిక్కు తీవ్రవాదాన్ని కాశ్మీర్లో పాక్ ప్రేరిత ఉగ్రవాదాన్ని ఎదుర్కొని ప్రాణాలర్పించింది వామపక్ష నాయకులే. అప్పట్లో పంజాబ్‌లో హరికిషన్‌సింగ్ సూర్జిత్, సత్యపాల్ డాంగ్(సిపిఐ)లే శాంతిని కాపాడారు. కాశ్మీర్లో సిపిఎం ఎంఎల్ఎ యూసఫ్ తరగామి వేర్పాటు వాదులను తరిమికొట్టి పలుసార్లు ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. అస్సాంలోనూ వేర్పాటు వాదులు వామపక్ష యువజన నాయకులను ముక్కలుగా నరికారు. అలాటి సంప్రదాయం గల వారు దేశద్రోహులను కీర్తిస్తారని ఆరోపించడం అర్థరహితం. సిపిఐ అగ్రనాయకుడు రాజా కుమార్తెపైన కూడా ఇదే కేసు మోపారంటే పోలీసులు ఎంత ఏకపక్షంగా వ్యవహరించారో తెలుస్తుంది. ఇప్పుడామెకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. జిలానీ అనే ప్రొఫెసర్‌పైనా ఇదే కేసు పెట్టారు.
దేశ వ్యతిరేక శక్తులెవరో నిర్ధారించి చర్య తీసుకోవచ్చు గాని యూనియన్ అద్యక్షుడిని ఇతర నేతలను అరెస్టు చేయడం ఎబివిపి ఒత్తిడిపై తీసుకున్నచర్య అని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. పైగా హౌం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా జోక్యం చేసుకోవడం బండారు దత్తాత్రేయ లేఖలో ఏం రాశారో దాన్నే ఆరోపించడం, వైస్‌ఛాన్సలర్ కూడా బెదిరింపులకు పాల్పడటం, బిజెపి ఎంపిమహేష్గిరి ఫిర్యాదు చేయడం ఇదంతా హెచ్‌సియు ఉదంతాన్ని మించిపోతున్నది. పోలీసుల పహారా అభ్యుదయ సంఘాల ప్రతినిధులను వేటాడటం ఒక రాజకీయ పద్దతిలో సాగుతుండటంపై యూనివర్సిటీలో ఎత్తున నిరనస ప్రతిధ్వనిస్తున్నది. అధ్యాపక సంఘాలు కూడా ఆందోళనలో వున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్ష నేతలు రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి విద్యార్థి నేతలను విడుదల చేయాలని కోరారు.అయితే ఆయన, మంత్రి సృతి ఇరానీ ఇప్పటికే తీవ్రమైన ప్రకటనలు చేశారు గనక ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా వారు కలుసుకుని మొత్తం ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. కేజ్రీవాల్ మేజిస్టీరియల్ దర్యాప్తుకు ఉత్తర్వులిచ్చారు కూడా. జెఎన్‌యులో భయానక వాతావరణం ఏర్పరిచారని ఆయన విమర్శిస్తే ఢిల్లీ డిజిపి బిఎస్బస్సీ బిజెపికి అనుకూలంగా ప్రకటన చేస్తూ దేశద్రోహులెవరనీ వదలిపెట్టే ప్రసక్తిలేదని హుంకరిస్తున్నారు.
విశ్వ విద్యాలయాల్లో ఎబివిపి పట్టు పెంచాలన్న నరేంద్ర మోడీ ప్రభుత్వ వ్యూహం ఆచరణలో బెడిసికొట్టడం అనివార్యంగా కనిపిస్తుంది.సీతారాం ఏచూరి అన్నట్టు ఇదంతా ఎమర్జన్సీని తలపించే వ్యవహారంగా వుంది. ప్రజాస్వామ్యవాదులెవరూ విద్యార్తులు విద్యావేత్తలపై పోలీసు దాడులను సమర్థించరు. ముందు సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలు సేకరించి ఒక పద్ధతిలో చర్య తీసుకోవడం వేరు. ఉన్నఫలాన దాడులు అరెస్టులకు పాల్పడటం వేరు. అందరిపైనా దేశద్రోహ ముద్రవేసి ఎబివిపి బిజెపి ఆరెస్సెస్‌లకు మాత్రమే దేశభక్తి ట్యాగ్ తగిలించుకోవాలనే ఎత్తుగడ హానికరమైంది. నెత్తురు మండే శక్తులు నిండే యువత ఇలాటి వాటితో మరింత ఆగ్రహౌదగ్రమైతే ఆ బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది. కొంతమంది అక్కడకు వెళ్లిన రాహుల్‌గాంధీని, కమ్యూనిస్టునేతలకు తిట్టిపోస్తున్నారు గాని ఆయనకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వ చర్యల వల్లనే వీరంతా రంగంలోకి దిగే పరిస్థితి ఏర్పడిందన్నది కాదనలేని వాస్తవం.