వయసు పెరిగే కొద్దీ బుద్ధి పెరగాలి. చదువు పెరిగే కొద్దీ సంస్కారంతో పాటు సరైన ఆలోచన పెరగాలి. దేశంలోని కొన్ని బడా విద్యా సంస్థల్లోని ప్రొఫెసర్లు, విద్యార్థుల ధోరణి చూస్తుంటే బడి పిల్లలే నయమనిపిస్తుంది. పదో తరగతి, ఇంటర్ వరకూ పిల్లల్లో యూనియన్ల గొడవలు, కులాల గొడవలు, సిద్ధాంత రాద్ధాంతాలు ఉండవు. యూనివర్సిటీ స్థాయికి వెళ్లే సరికి కులం పేరుతో వాదనలు గొడవలు జరుగుతాయి. యూనియన్ల పేరుతో కొట్టాటలుంటాయి. అతి తెలివితో జాతి వ్యతిరేకంగా మాట్లాడటం ఫ్యాషన్ అవుతుంది. మేధావి కోవకు చెందిన వారనే కొందరి ప్రభావం వల్ల జాతి వ్యతిరేక ధోరణులు ప్రబలుతున్నాయి.
అది వాళ్ల తప్పు అనేకంటే, ఓటు బ్యాంకు రాజకీయాలను పెంచి పోషించిన పాలకులనే ఎక్కువగా తప్పు పట్టాలి. అఫ్జల్ గురును ఉరితీయడానికి మీనమేషాలు లెక్కించిన ప్రభుత్వం, ఈ దేశానికి ఎలాంటి సంకేతాన్నిచ్చింది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి యాకూబ్ మెమన్ అమర వీరుడంటూ నినాదాలు చేస్తూ ఆ మధ్య ఊరేగింపు నిర్వహించాడట. వివాదాస్పద గొడవల్లో తలదూర్చిన కారణంగా అతడిని సస్పెండ్ చేయడం కూడా తప్పనే స్థాయికి తెలివి తెల్లారిపోతోంది. అతడు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైన విషయమే. కానీ అంతకు ముందు చేసిన జాతి వ్యతిరేక చర్యను పూర్తిగా విస్మరించి యూనివర్సిటీ యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని మాత్రమే నిందించడం మేధావి లక్షణం కాదు. ఉగ్రవాది యాకూబ్ మెమన్ ను కీర్తించడం సబబే అని ఎవరైనా అనగలరా?
కాశ్మీర్ ను భారత్ బలవంతంగా ఆక్రమించిందని జేఎన్ యులో ఒక మహిళా ప్రొఫెసర్ పదే పదే జాతి వ్యతిరేక ప్రసంగాలు చేస్తుంటారట. తాజాగా మరోసారి అలాగే ప్రసంగించాని వార్తలు వచ్చాయి. అదే నిజమైతే, అందుకు ఆధారాలు (ప్రైమా ఫేసీ) ఉంటే ఆ ప్రొఫెసర్ ను వెంటనే అరెస్టు చేయాలి. ఇలాంటి వారే విద్యార్థుల మనసుల్లో విషబీజాలు నాటుతారు. అది ఎ ఐ ఎస్ ఎఫ్ కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, విద్యార్థి సంఘం ఏదైనా తన కార్యకలాపాలు చేసుకోవచ్చు. ఇందులో ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే, నిషిద్ధ విప్లవ గ్రూపుల అనుబంధ సంఘాలు క్యాంపస్ లను జాతి వ్యతిరేక చర్యలకు అడ్డాగా మార్చుకున్నాయి. ఇలాంటి వారికి కొందరు ప్రొఫెసర్లు ఫిలాసఫ్లుగా గైడ్లుగా సహాయం చేస్తున్నారు.
ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఉమర్ ఖాలిద్ విద్యార్థి సంస్థ సీపీఐ (మావోయిస్టు) పార్టీకి అనుబంధమని అప్పటి యూపీఏ ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి ఎన్డయే ప్రభుత్వం చెప్తోంది. నిషిద్ధ గ్రూపులకు ముసుగు సంస్థలుగా విద్యార్థి సంఘాల పేరుతో విద్యాలయాల్లో జాతి వ్యతిరక చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోవాలా? ప్రపంచంలో ఏ దైశంలోనైనా సరే ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే ప్రభుత్వం ఊరుకోదు. జాతి వ్యతిరేకులకు కచ్చితంగా శిక్ష పడుతుంది. మరి మన దేశంలో మాత్రం అచ్చోసిన ఆంబోతుల్లా ప్రజల సొమ్ముతో తింటూ, ప్రజల సొమ్ముతో నిర్మించిన హాస్టళ్లలో ఉంటూ, కాలేజీల్లో చదువుతూ ప్రజలకు, జాతికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారికి కఠినమైన శిక్ష పడాల్సిందే. క్యాంపస్ లలో జాతి వ్యతిరేకులను ఏరివేయాలని ఆరెస్సెస్ డిమాండ్ చేసింది. అయితే, అతివాద భావజాలంతో వ్యవహరించే సంఘ్ పరివార్ సంస్థల వారి చేష్టలకు కూడా చెక్ పెట్టడం తప్పనిసరి. విద్యాలయాల్లో చదువు మాత్రమే జరగాలి. అంతకు మించి మరేదీ జరగకూడని వాతావరణం కల్పించాలి.