నాగార్జునసాగర్ ఉపఎన్నికకు ముందు కేసీఆర్ చేసిన యాభై వేల ఉద్యోగాల భర్తీ ప్రకటనపై.. మళ్లీ హుజూరాబాద్ ఉపఎన్నికల ముందు కదలిక వచ్చింది. మరో నెల రోజుల్లో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ రాబోతోందని.. కొత్తగా ప్రభుత్వం నుంచి మీడియాకు సమాచారం వస్తోంది. ఇప్పటి వరకూ ఉద్యోగాల భర్తీకి జోనల్ సమస్య అడ్డుగా ఉందని.. తెలంగాణ సర్కార్ వాదిస్తూ వస్తోంది. ఈ సమస్యకు.. బుధవారం కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపించింది. తెలంగాణ సర్కార్ ప్రతిపాదించిన జోన్లన్నింటినీ ఆమోదిస్తూ..నోటిఫై చేసింది. జోనల్ ఇష్యూ కొలిక్కి వచ్చినందున ఇక ఉద్యోగాల జాతరేనని ఎపీపీఎస్సీ వర్గాలు చెప్పడం ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఒక్క సారి కూడా గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాలేదు.
ఈ సారి రెండు వేలకుపైగా పోస్టులతో గ్రూప్ వన్, టు నోటిఫికేషన్లువస్తాయని అంటున్నారు. ముఖ్యమంత్రి గతంలో హామీ ఇచ్చిన 50వేల పోస్టులు ఒకేసారి భర్తీ చేస్తామని ఇప్పటికే సీఎస్ సోమేష్ కుమార్ ప్రకటించారు. అంటే గ్రూప్స్ మాత్రమే కాకుండా ఇతర ఉద్యోగాలను కూడా ఒకే సారి భర్తీ చేయనున్నారన్నమాట. అయితే.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణ సర్కార్ ఉద్యోగాల ముచ్చట తీసుకు వస్తుందని.. యువత నమ్మకం కోల్పోయే పరిస్థితికి చేరింది. ఎందుకంటే.. గ్రాడ్యూటేయ్ ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్ ఉపఎన్నికకు ముందు ఇక భర్తీనే అన్నట్లుగా ప్రకటనలు చేసిన సీఎం కేసీఆర్.. అవన్నీ ముగిసిపోయి నెలలు గడుస్తున్నా.. నోటిఫికేషన్ల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.
సందర్భం వచ్చినప్పుడల్లా.. త్వరలో.. త్వరలో అని చెప్పి కవర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చే వరకూ ఆశ చూపుతారని.. ఉపఎన్నిక పూర్తయిన తర్వాత మర్చిపోతారని నిరుద్యోగ యువత విమర్శలు గుప్పిస్తున్నారు. వారి విమర్శల్లో వాస్తవం కూడా ఉంది. తెలంగాణ సర్కార్.. మభ్య పెట్టేందుకే.. ఉద్యోగ ప్రకటనలు చేస్తోందని.. ఎన్నికలు వచ్చిన సమయంలోనే.. హడావుడి చేయడం.. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా.. తర్వాత ఉద్యోగ ప్రకటనపై సైలెంటయిపోవడం.. కామన్‌గా మారింది.