ఏపీ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఆయనను చత్తీస్ ఘడ్ పంపారు. ఇప్పుడు రాజ్ భవన్లో కొన్ని వివాదాలు బయటకు వస్తున్నాయి. రాజ్ భవన్ లో ఔట్ సోర్సింగ్ పద్దతిలో పని చేస్తున్న వంద మందికిపైగా ఉద్యోగులను పర్మినెంట్ చేయిస్తామని కొంత మంది గూడుపుఠాణి నడిపినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం తేలక ముందే గవర్నర్ బదిలీపై వెళ్తూండటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
రాజ్ భవన్ లో మొత్తం వివిధ కేటగిరీల్లో 140 మంది ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్నారు. వీరు ఎవరూ కనీసం కాంట్రాక్ట్ సిబ్బంది కూడా కాదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. వారిలో వంద మందిని పర్మినెంట్ చేయించేందుకు కొంత కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజ్ భవన్ కు వంద మంది పర్మినెంట్ సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఆ వంద మందిని ప్రస్తుతం పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పర్మినెంట్ చేయించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అధికారులు మాత్రం ఇలా చేయడం సాధ్యం కాదని చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఇక్కడి వరకే వచ్చిందంటున్నారు.
రాజ్ భవన్ లో ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయించాల్సిన అవసరం ఎవరికి వచ్చిందనేది ఇప్పుడు కీలకమైన అనుమానంగా మారింది. గవర్నర్ పేరు చెప్పుకుని ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడుతున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఇంత కాలం తమ ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని అనుకున్న వారు.. ఇప్పుడు గవర్నర్ బదిలీపై వెళ్తూంటంతో… జరిగిన విషయం అంతా.. మీడియాకు లీక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై నిజానిజాలు బయటకు రావాల్సి ఉంది.