తెలుగులో తొట్ట తొలి ఓటీటీ సంస్థగా ఆవిర్భవించింది ‘ఆహా’. ఈ సంస్థ వెనుక పెద్ద తలకాయలే ఉన్నాయి. పెట్టుబడులకు ఢోకా లేదు. అయితే కంటెంట్ విషయంలో `ఆహా` ఎందుకో వెనుకబడిపోయింది. సినిమాల్ని కొనడంలో, కొత్త తరహా కార్యక్రమాలు చేపట్టడంలో విఫలమైంది. దాంతో చాలా కాలంగా ‘ఆహా’ నష్టాల బాటలో నడుస్తోంది. ఈమధ్య ఈటీవీ విన్ పుంజుకొంది. ఈటీవీ ఒరిజినల్స్ కొన్ని మంచి విజయాల్ని అందుకొన్నాయి. దాంతో పాటు చిన్న సినిమాలన్నీ ఈటీవీ విన్కి వెళ్లిపోతున్నాయి. ఈ పోటీని సైతం ‘ఆహా’ తట్టుకోలేకపోతోంది. దాంతో నష్టాలు తీవ్రతరం అయ్యాయి. కంటెంట్ ని సెలెక్ట్ చేసే టీమ్, సినిమాలకు అప్రువల్ ఇచ్చే టీమ్… ప్రేక్షకులకు నచ్చే సినిమాల్ని ఎంచుకోలేక అవస్థలు పడుతోంది. దాంతో ‘ఆహా’లో మార్పులు మొదలయ్యాయని తెలుస్తోంది.
ఈమధ్య కాలంలో ‘ఆహా’లో దాదాపు 80 మంది ఉద్యోగుల్ని పక్కన పెట్టార్ట. వాళ్లలో కొంతమందికి నెల రోజుల జీతాన్ని అడ్వాన్సుగా ఇచ్చి, ఇళ్లకు పంపించేశారని, ఇంకొంతమందిని బలవంతంగా దించేశారని, మరికొంతమంది ఉద్యోగులు స్వచ్ఛందంగా వెళ్లిపోయారని తెలుస్తోంది. జీతాల భారం కొంత తగ్గించుకోవడానికీ ఇది కొంత మేర ఉపయోగపడుతుంది. కొత్తవాళ్లొస్తే… కొత్త ఆలోచనలు వస్తాయన్నది ఆహా ఆలోచన కావొచ్చు.
ఓటీటీ అంటే వెబ్ సిరీస్‌లు ఎక్కువ ఆశిస్తారు. కానీ ఆహాలో క్లిక్ అయిన వెబ్ సిరీస్ లు పెద్దగా కనిపించవు. ఓటీటీ ఒరిజినల్స్ పేరుతో సినిమాలు దింపుతున్నా అవి మరీ.. చిన్న సైజు సినిమాలు. ఆహాలో స్ట్రీమ్ అయిన పెద్ద సినిమా ఒక్కటీ లేదు. చిన్న సినిమాలు ఉన్నా, అవి పెయిడ్ ఫర్ వ్యూ పద్ధతిన తీసుకొంటున్నవే. అందరి దృష్టీ ఆహాపై పడాలంటే, ఆహా నిలదొక్కుకోవాలంటే ఒర్జినల్ కంటెంట్ తో రావాల్సిందే. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టాలి. కొత్త టీమ్ వస్తోంది కదా, వాళ్లయినా ఈ దిశగా ఆలోచిస్తారేమో చూడాలి.