అమెరికా అధ్యక్ష పీఠం డెమెక్రాట్ల వశమైంది. జో బైడెన్ సంచలన విజయం నమోదు చేశారు. మూడు రోజుల నుంచి ఉత్కంఠగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. రెండు రాష్ట్రాల్లో ఇంకా కొలిక్కి రానప్పటికీ.. 290 ఎలక్టోరల్ ఓట్లు సాధించి బైడెన్ విజయం సాధించారు. అరిజోనా, పెన్సిల్వేనియాల్లో లెక్కింపు పూర్తయ్యే సరికి బైడెన్ ఆధిక్యంలో నిలిచారు. దాంతో ఆయా రాష్ట్రాల్లోని ఎలక్టోరల్ ఓట్లన్నీ ఆయన ఖాతాలో పడ్డాయి. ఇంకా జార్జియాలో ఆధిక్యంలో ఉన్నారు. అక్కడా గెలిస్తే.. ఎలక్టోరల్ ఓట్లు మూడు వందలు దాటిపోనున్నాయ.ి
538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకు గాను ఆయన 290 ఓట్లు సాధించారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే దక్కాయి. అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణం చేయనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరికీ రానన్ని ఓట్లు బైడెన్‌కు వచ్చాయి. అమెరికాలో ఒకసారి అధ్యక్ష పీఠం ఎక్కినవారు రెండోసారి విజయం సాధించడం కామన్. కానీ ట్రంప్ తన వాచాలత్వంతో దూరం చేసుకున్నారు.
ట్రంప్‌లా కాకుండా చాలా కింద స్థాయి నుంచి రాజకీయ నేతగా ఎదిగిన బైడెన్ తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించి ఎన్నికల బరిలో దిగారు. సౌమ్యత, ఆలోచించి మాట్లాడే స్వభావం ఆయనకు బాగా కలిసి వచ్చాయి. ట్రంప్ మాత్రం విభజించు.. పాలించు అన్నట్లుగా వ్యవహరించారు. మెజార్టీ ప్రజల్ని ఆకట్టుకునేదిశగా జాతీయవాదాన్ని రంగరించేవారు. చైనాను బూచిగా చూపి ఎన్నికల్లో గెలుద్దామనుకున్నారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.