చంద్రబాబు ఇంటిపై దాడి చేశారు. తాము పెద్ద రౌడీ పుడింగినని జగన్ దగ్గర సర్టిఫికెట్ కొట్టేసి.. కొడాలి నాని, పేర్ని నాని వంటి వాళ్లను కూడా పక్కకు నెట్టేసి మంత్రి పదవి పొందారు. ఇప్పుడు ఆ మంత్రి పదవి లేదు.. కనీసం ఎమ్మెల్యే పోస్టు కూడా లేదు. కానీ చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసు మాత్రం అలాగే ఉంది. అప్పట్లో జగన్ రెడ్డి ప్రభుత్వం కేసు పెట్టకపోయినా వీడియో రికార్డింగ్స్ అన్నీ సాక్ష్యాలుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పోలీసులు కేసు పెట్టేశారు.
కేసు పెట్టేశారని .. అర్థరాత్రి పూట గోడలు దూకి .. తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో జోగి రమేష్ వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై కేసు నమోదయిందని అరెస్టు చేసే అవకాశం ఉందని ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎనిమిదో తేదీన జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. తమ ప్రభుత్వం ఉందని ప్రతిపక్ష నేత ఇంటిపైనే దాడి చేసి అదే అర్హతగా మంత్రి పదవి పొందిన ఆయన ఇప్పుడు అదే ఘటన కారణంగా జైలుకు దగ్గరగా ఉన్నారు.
టీడీపీ ప్రభుత్వం ఆయనను జైలుకు పంపాలంటే.. ఇదొక్కటే కాదు.. అగ్రిగోల్డ్ భూముల్ని కబ్జా చేసిన కేసు కూడా రెడీగా ఉంది. ఇంకా ఆయన మంత్రిత్వ శాఖలో చేసిన నిర్వాకాల దగ్గర నుంచి చాలా కేసులు పెట్టుకోవచ్చు. అయితే చంద్రబాబు ఇంటిపై దాడి కేసు ఇప్పుడు లైవ్ లో ఉంది కాబట్టి.. ఆ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు జోగిరమేష్ న్యాయస్థానం వద్దకు పరుగులు పెడుతున్నారు.