మాజీ మంత్రి జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూముల్ని అమ్ముకున్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకుని అమ్మేసుకుని కోట్లు వెనకేసుకున్నారు. ఈ విషయంలో అన్ని ఆధారాలతో బయటపడింది. పత్రికల్లో రెండురోజుల నుంచి రాస్తున్నారు. మరి ఆయనపై కేసు నమోదయిందా అంటే… అలాంటి సమాచారమే లేదు. అదే వైసీపీ ప్రభుత్వంలో అలాంటిదేమీ లేకపోయినా చిలువలు పలువలుగా ప్రచారం చేసేసి అరెస్ట్ చేసేసి ఉండేవాళ్లు. కోర్టులో నిరూపితమవుతుందా లేదా అన్నది తర్వాత సంగతి జైల్లో పెట్టామా లేదా అన్నదే చూసుకునేవారు. కానీ ఇప్పుడలా జరగడం లేదు.
జోగి రమేష్ మామూలు వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు ఇంటిపైకి దాడులకు వెళ్లిన వ్యక్తి. ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడిన వ్యక్తి. కుటుంబాలపై విషం చిమ్మిన లీడర్. సాక్షాత్తూ అసెంబ్లీలోనే అడ్డగోలుగా మాట్లాడి తన నాయకుడి మనసు రంజింప చేసి మంత్రి పదవి కొట్టేసిన నేత. ఇంత గొప్ప నేత కబ్జా చేసి భూమిని అమ్ముకున్నాడని తెలిసిన తర్వాత కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు. కేసులు ఎందుకు పెట్టడం లేదు ?
గతంలో టీడీపీ నేతల మీద కేసులు పెట్టిన పోలీసు అధికారులు ఎంత మందో చెప్పాల్సిన పని లేదు. టీడీపీ నేతలపై తప్పుడు ఫిర్యాదులు చేసిన వారి లెక్కలూఉన్నాయి. అంతా ఉద్యోగుల్ని ముందు పెట్టి నడిపించేవారు. ఇప్పుడు ఆ ఉద్యోగులు తాము కూడా ఎక్కడ దొరికిపోతామో అని ఈ కబ్దాలపై మౌనం పాటిస్తున్నారు. పత్రికల్లో వచ్చినా చర్యలు మాత్రం ప్రారంభం కావడం లేదు.