దేశంలో పేదరికం ఎంతుందో… పేదల్ని తయారు చేసే వ్యవస్థ కూడా అంతే.. బలంగా ఉంది. .ప్రభుత్వ ఆడంబరాలు, అనవసరమైన ఖర్చులు – పేదల్ని తయారు చేసే యంత్రాలుగా మారుతున్నాయి. ప్రతీ పైసా.. ప్రజల కోసమే ఖర్చు చేస్తే… ప్రతీ సంక్షేమ పథకం నిజాయతీగా అమలు చేస్తే తప్పకుండా పేదల కన్నీళ్లు తడవగలం. కానీ.. దురదృష్టవశాత్తూ అదే జరగడం లేదు. ఈ విషయాన్ని నిజాయతీగా చెప్పే ప్రయత్నం.. `జోహార్`లో కనిపించింది. థియేటర్లు మూతబడిన వేళ ఓటీటీ ద్వారా విడుదలైన మరో సినిమా ఇది. మరి… జోహార్ లో ఏం చెప్పారు? ఇప్పటి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు `జోహార్`లో ఎంత వరకూ కనిపించాయి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అత్యుతరామయ్య (చలపతిరావు) మరణంతో.. ఆ స్థానంలోకి వస్తాడు అత్యుతరామయ్య వారసుడు విజయ్ వర్మ (చైతన్య కృష్ణ). తండ్రి పేరు శాశ్వతంగా, చిరస్థాయిగా మిగిలిపోవడం కోసం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని నిర్మించాలని భావిస్తాడు. అందుకోసం హైకమాండ్ ఫండ్ ఇవ్వకపోయినా, సంక్షేమ పథకాలలో మూడు వేల కోట్ల కోత వేసి, విగ్రహాన్ని కట్టిస్తాడు. అయితే ఆయా సంక్షేమ పథకాలు అందక… ఎవరెవరి జీవితాలు ఎలా చిన్నాభిన్నం అయ్యాయి? బాల అనే క్రీడాకారణి, బోస్ అనే దేశభక్తుడు, గంగమ్మ అనే పేద రైతు, జ్యోతి అనే విద్యార్థి జీవితాలు ఎంత దుర్భరంగా మారాయి? అనేదే `జోహార్` కథ.
ఐదు కథల సమాహారం జోహార్. ఒక కథకూ మరో కథకూ సంబంధం లేదు. కానీ.. సీ.ఎం తీసుకున్న అనాలోచిన నిర్ణయం వల్ల ఈ ఐదు జీవితాలూ ప్రభావితం అవుతాయి. అదెలా అన్నది జోహార్ చూసి తెలుసుకోవాల్సిందే. సమకాలీన రాజకీయ పరిస్థితికి అద్దం పట్టిన సినిమా ఇది. కేవలం ఆర్భాటాల కోసం, ఆడంబరాల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడితే.. విగ్రహాలతో రాజకీయాలు చేస్తే… వాటి కింద ఎన్ని జీవితాలు నలిగిపోతాయో చెప్పే ప్రయత్నం చేశారు. ఉద్దానం సమస్య, క్రీడల్లో రాజకీయాలు.. ఇలాంటి విషయాలూ ఉప కథలుగా వస్తుంటాయి. అయితే.. ఇవన్నీ తెలిసిన సమస్యలే. ఇది వరకు సినిమాల్లో చూపించిన విషయాలే. అందుకే… అవేం అంతగా కదిలించకపోతాయి. ఒక కథకూ, మరో కథకీ సంబంధమే ఉండదు. కాబట్టి.. అవన్నీ బిట్లు బిట్లుగా చూస్తున్న భావన కలుగుతుంది. ప్రచార చిత్రాలు చూస్తే.. ఇదో రాజకీయ వ్యంగ్యాస్త్రం అనిపిస్తుంది. అలాంటి కథే. కాకపోతే… దాంతో పాటు చాలా ఉప కథలు ఉండడంతో.. ఏ కథపైనా పూర్తిగా మనసు లగ్నం చేయలేం. కాకపోతే.. ఇవన్నీ రాజకీయాలతోనే ప్రభావితం అయ్యే కథలు. మనకు తెలిసిన కొన్ని జీవితాలు కళ్లముందు కదలాడతాయి. ఇటీవల దేశవ్యాప్తంగా నిర్మించిన భారీ విగ్రహం.. వెనుక కూడా ఇలాంటి కథే జరిగి ఉంటుందేమో.. అన్న ఆలోచనా వస్తుంది.
నటీనటుల పరంగా ఏ ఒక్కరూ, పాత్రకు అన్యాయం చేయలేదు. వీలైనంత వరకూ పాత్ర ఔచిత్యం పెంచడానికే చూశారు. బాల, జ్యోతి, గంగమ్మ, బోసు.. ఇలా పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. సంభాషలు ఆకట్టుకునేలా ఉన్నాయి. రాజకీయాలపై సెటైర్లు, జీవిత తత్వం, దేవుడు, డబ్బు.. ఇలా చాలా విషయాలపై డైలాగులు పండాయి. నిజాయతీగా చేసిన ప్రయత్నం ఇది. కమర్షియల్ హంగులేం ఉండవు. కాస్త ఓపిగ్గా చూడగలగాలి. పాటలు బాగున్నాయి. కథలో అంతర్లీనమైపోయాయి. రెండు గంటల నిడివి ఉన్న సినిమా ఇది. ఇంకాస్త ట్రిమ్ చేసుకునే అవకాశమూ ఉంది. ఓటీటీ కే కాబట్టి… ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది.