నిన్న విడుదలైన జాన్ అబ్రహం సినిమా అటాక్ రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ తారక్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ముందు పూర్తిగా చతికిలపడ్డట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా ని కించపరుస్తూ ఇటీవల జాన్ అబ్రహం వ్యాఖ్యలు:
నిజానికి పాన్ ఇండియా స్థాయిలో రాజమౌళి రూపొందించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ని జాన్ అబ్రహం ఎటాక్ సినిమాతో పోల్చ వలసిన అవసరం వచ్చేది కాదు. కానీ నాలుగు రోజుల కిందట జాన్ అబ్రహం తెలుగు సినిమాను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో అటాక్ సినిమా ఫలితం ఎలా ఉంటుంది అన్న అంశంపై సినీ పరిశీలకులు దృష్టి సారించారు. జాన్ అబ్రహం అటాక్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ, బాలీవుడ్ సినిమా ఏ ప్రాంతీయ సినిమా కంటే తక్కువ కాదని, బాలీవుడ్ పరిశ్రమ నంబర్ టు స్థానంలో ఉన్న పరిశ్రమ కాదని వ్యాఖ్యానించారు. సలార్ సినిమా లో ప్రభాస్ తో పాటు మీరు కూడా నటిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించినపుడు సెకండ్ హీరోగా నటించడానికి తాను ప్రాంతీయ సినిమా నటుడు కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురి చేశాయి. గతంలో బాహుబలి సినిమా విడుదల సమయంలో పద్మావతి చిత్ర యూనిట్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద జాన్ అబ్రహం అటాక్ సినిమా ఇప్పటికే థియేటర్లలో వీరవిహారం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా దెబ్బకు కుదేలు అవుతుందన్న భయంతోనే జాన్ అబ్రహం ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడని విశ్లేషణ లు వినిపించాయి. పైగా అటాక్ సినిమా నిర్మాతలలో జాన్ అబ్రహం కూడా ఒకరు. దీనికితోడు సత్యమేవ జయతే 2 వంటి ఘోరమైన ఫ్లాపుల తర్వాత జాన్ అబ్రహం నుండి వస్తున్న సినిమా కావడంతో ఒత్తిడి కారణంగా ఈ వ్యాఖ్యలు జాన్ అబ్రహం చేసి ఉంటాడని విశ్లేషణలు వినిపించాయి.
యావరేజ్ రేటింగ్, ఎవరేజ్ టాక్ సంపాదించుకున్న అటాక్:
మొత్తం మీద నిన్న అటాక్ సినిమా తెర ముందుకు వచ్చింది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా రూపొందిన ఈ సినిమా కి సమీక్షకులు యావరేజ్ రేటింగ్ ఇచ్చారు. పోనీ, మల్టీప్లెక్స్ ఆడియన్స్ కోసం రూపొందిన ఈ సినిమాకు వారి నుండి అయినా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందా అనుకుంటే అదీ లేదు. ఈ సినిమాలోని ఏ ఏ సీన్లు ఏ ఏ హాలీవుడ్ సినిమా సన్నివేశాల ప్రేరణ తో రూపొందాయో వారు సినిమాలోని సీన్ లను ఒరిజినల్ హాలీవుడ్ సినీ మూలాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. దీంతో అటు మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ లో సైతం ఈ సినిమాకు పెద్దగా పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం లేదు.
అటాక్ మొదటి రోజు కలెక్షన్లు, ఆర్ ఆర్ ఆర్ ఎనిమిదవ రోజు కలెక్షన్ లలో 1/3 వంతు:
సరే , కొన్నిసార్లు సమీక్షకులు తక్కువ రేటింగ్ ఇచ్చినా, మల్టీ ప్లక్స్ ఆడియన్స్ పట్టించుకోకపోయినా సినిమాకు మంచి ఓపెనింగ్స్ కలెక్షన్స్ వచ్చిన సందర్భాలు గతంలో చాలా సార్లు చూశాం. అయితే ప్రస్తుతం ఉన్న బాక్సాఫీస్ రిపోర్ట్స్ బట్టి చూస్తే అటాక్ సినిమాకు విడుదలైన మొదటి రోజున దాదాపు మూడు కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. అయితే ఆర్.ఆర్ ఆర్ సినిమా విడుదలైన ఎనిమిదవ రోజు అయిన అదే రోజున ఆర్ఆర్ఆర్ సినిమాకు దీనికి దాదాపు మూడు రెట్లకు పైగా కలెక్షన్లు సాధించడం విశేషం.
ఏది ఏమైనా ఆర్.ఆర్ సినిమాపై కించపరిచే వ్యాఖ్యలు చేయడం ద్వారా తన మీద ప్రాంతీయ సినిమా ఆడియన్స్ లో ఉన్న సదభిప్రాయాన్ని పూర్తిగా పాడు చేసుకున్న జాన్ అబ్రహం కి అటు ఫలం దక్కక పోవడంతో పాటు ఇటు వ్రతం కూడా చెడినట్లు అయిందని పరిశీలకులు అంటున్నారు. జాన్ అబ్రహం వ్యాఖ్యలతో నొచ్చుకున్న కొందరైతే మరొక అడుగు ముందుకు వేసి, అసలు ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్ కూడా పలకకుండా రెండు దశాబ్దాలు నటనా కెరీర్ ని నెట్టుకొని వచ్చిన జాన్ అబ్రహం కనీసం ఇప్పుడైనా యాక్టింగ్ లో ఓనమాలు నేర్చుకోవాలని, ఆ ఓనమాలు నేర్చుకున్న తర్వాత ఇతర భాషల సినిమాలలో నటించడం గురించి ఆలోచించవచ్చు అని హితవు పలుకుతున్నారు.