ఇప్పుడు హోమ్ లోన్స్ లేకుండా ఇల్లు కొనడం అనేది సాధ్యం కావడం లేదు. ప్రతి ఇంటికి లోన్ తీసుకుంటున్నారు. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగులు అయితే చెప్పాల్సిన పని లేదు. ఇద్దరి అభిరుచులకు తగ్గట్లుగా మంచి లగ్జరీ ఇల్లే కొంటున్నారు. అయితే మొత్తం ఈఎంఐ ఒకరి జీతం నుంచి పెట్టేసి.. మరొకరివి ఇంటి ఖర్చుులు. ఇతర పొదుపుల కోసం వాడేవారు ఎక్కువ. అక్కడే పొరపాటు చేస్తున్నారని ఆర్థిక నిపుణులు అంటున్నారు. హోమ్ లోన్స్ జాయింట్ గా తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు.
జాయింట్ హోమ్ లోన్లో ప్రధాన రుణ గ్రహీత, సహ రుణ గ్రహీత ఉంటారు. భార్య, భర్త సహ యజమానులుగా ఉండేటట్టు అయితే అప్పుడు బ్యాంకులు ఇద్దరి పేరిట జాయింట్ హోమ్ లోన్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటే ఎక్కువ మొత్తంలో రుణం లభిస్తుంది. ఇద్దరి పేరిట రుణం ఇవ్వడానికి బ్యాంకులు ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే ఒకరి నుంచి కాకపోయినా, మరొకరి నుంచి అయినా రికవరీ చేసుకోవచ్చన్న ధీమా బ్యాంకులకు ఉంటుంది.
అదే సమయంలో ఉమ్మడిగా గృహరుణం తీసుకుంటే.. ఇద్దరికీ ఆదాయపన్ను ప్రయోజనం ఉంటుంది. నిజానికి ఇప్పుడు కట్టే వడ్డీ లేదా అసులతో పోలిస్తే కేంద్రం ఇస్తున్న మహాయింపు చాలా తక్కువ, దాన్ని ఇరువురూ క్లెయిమ్ చేసుకోవడం వల్ల డబుల్ చేసుకోవచ్చు. ఇంటి రుణానికి ఒక ఏడాదిలో చేల్లించే వడ్డీలో 2 లక్షల వరకు సెక్షన్ 24 కింద పన్ను చెల్లించక్కర్లేదు. ఇక అసలుకు చేసే చెల్లింపులు 1.5 లక్షలను సెక్షన్ 80సీ కింద మినహాయించి చూపించుకోవచ్చు. ఈ పరిమితి ఎవరికి వారికే విడిగా అమలవుతుంది.
జాయింట్ లోన్ తీసుకునేటప్పుడు ఎవరి ఖాతా నుంచి ఎంత కట్ చేసుకోవాలో బ్యాంకుకు సమాచారం ఇస్తే చాలు. చాలా బ్యాంకులు మహిళా రుణ గ్రహీతలకు రుణ రేటులో కొంత తగ్గింపును ఇస్తున్నాయి. కాబట్టి భార్యా భర్తలు జంటగా హోమ్ లోన్ తీసుకుంటే డబుల్ ప్రయోజనాలు కలుగుతాయని అనుకోవచ్చు.