తెలంగాణ ఎన్నికల్లో అనేక మంది ప్రముఖులు ఓడిపోయారు. నలుగురు మంత్రులతో పాటు స్పీకర్ అధికార పార్టీలో ఉండగా.. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులు అనగలిగే వాళ్లంతా పరాజయం పాలయ్యారు. బీజేపీలోనూ ఈ బాపతు నేతలు ఉన్నారు. తెలంగాణ బీజేపీకి ఓ ఫేస్‌గా మారిన కిషన్ రెడ్డి .. కాలేరు వెంకటేష్ అనే అనామక నేత చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. వరుసగా గెలుస్తూ.. వస్తూ.. తనంటే.. బీజేపీ.. బీజేపీ అంటే తను అన్నట్లుగా.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా.. ప్రభావం చూపిన కిషన్ రెడ్డి… చివరి క్షణంలో టిక్కెట్ దక్కించుకున్న ఓ మామూలు నేత చేతిలో ఓడిపోయారు. కాలేరు వెంకటేష్ న్యాయవాది. ఆయన భార్య కార్పొరేటర్‌గా ఉన్నారు. నిజానికి కాలేరు వెంకటేషన్ పోటీకి పెద్దగా ఆసక్తి చూపించలేదని సమాచారం. కానీ కేటీఆర్ చొరవతో.. బరిలోకి దిగారు. జెయింట్ కిల్లర్‌గా కిషన్ రెడ్డిని ఇంటికి పరిమితం చేశారు.
ఇక అధికార పార్టీలో అందరికీ షాక్ ఇచ్చిన ఫలితం.. తుమ్మల నాగేశ్వరరావు ఓటమి. పాలేరులో ఆయన ఉపేందర్ రెడ్డి అనే నేత చేతిలో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా ఉంటున్న ఉపేందర్ రెడ్డి.. చాలా సార్లు టిక్కెట్ కోసం ప్రయత్నించారు. కానీ అక్కడ రాంరెడ్డి వెంకటరెడ్డి బలంగా ఉండటంతో ఆయనను కాదని టిక్కెట్ తెచ్చుకోలేకపోయారు. ఆయన మరణం తర్వాత అక్కడ ఏర్పడిన శూన్యత కారణంగా టిక్కెట్ తెచ్చుకున్నారు. తుమ్మలను ఓడించడం అసాధ్యమని అందరూ అనుకున్నారు కానీ.. చేసి చూపించారు. తుమ్మల ఇంటికే పరిమితం చేశారు. ఇక మరో మంత్రి జూపల్లి కృష్ణారావును కొల్లాపూర్‌లో ఓడించినది కూడా.. రాజకీయాల్లో కొత్తగా వచ్చిన బీరం హర్షర్ధన్ రెడ్డినే. ఇక తాండూరులోతిరుగులేదనుకున్న మంత్రి మహేందర్ రెడ్డిని ఇంటికి పరిమితం చేసింది.. పైలట్ రోహిత్ రెడ్డి అనే యువకుడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో పని చేశారు. ఆయన పార్టీలో ఎదుగుతూంటే…మధ్యలో వచ్చిన మహేందర్ రెడ్డి బయటకు పంపేశారు. రోహిత్ రెడ్డికి అండగా నిలిచి.. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి… మహేందర్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకున్నారు.
ఇక కాంగ్రెస్‌లో కీలక నేతల్ని మట్టి కరిపించిన జెయింట్ కిల్లర్స్ చాలా మంది కొత్త వాళ్లే. డీకే అరుణను.. ఓడించిన కృష్ణమోహన్ రెడ్డి… గత కొన్నేళ్లుగా మేనత్తను ఓడించడానికి చాలా పార్టీల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ సారి టీడీపీ తరపున కూడా పోటీ చేశారు. చివరికి విజయవంతం అయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై గెలిచిన భూపాల్ రెడ్డి.. టీడీపీ నుంచి వెళ్లారు. ఒంటి చేతుల్లో ఆయన చేసే రాజకీయానికి తొలి సారి విజయం దక్కింది. రేవంత్ రెడ్డిపై గెలిచిన పట్నం నరేంద రెడ్డి.. తాండూరు నుంచి ఓడిపోయనన మహేందర్ రెడ్డి తమ్ముడు. టీడీపీలో ఉన్నప్పుడు ఎమెల్సీగా గెలిచారు. ఆ తర్వతా టీఆర్ఎస్ లో చేరి మళ్లీ ఎమ్మెల్సీ అయ్యారు. పక్కా వ్యూహంతో రేవంత్ రెడ్డిని ఓడించారు. ఇలా ఈ ఎన్నికలతో పలువురు జెయింట్ కిల్లర్లు తెలంగాణ రాజకీయాల్లోకి దూసుకొచ్చారు.