టీడీపీ – జనసేన ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నాయి. పొత్తుల్లో భాగంగా ఎవరి మేనిఫెస్టోలు వాళ్లవి కాకుండా ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలని నిర్ణయించారు. టీడీపీ మహానాడులో మినీ మేనిఫెస్టో ప్రకటించారు. ఆరు హామీలు ఇచ్చింది. వాటికి గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి వెళ్లింది. అయితే అనూహ్యంగా చంద్రబాబును అరెస్టు చేయడంతో గత నెలన్నరగా అవి ఆగిపోయాయి. ఈ లోపు పొత్లులు ఖరారయ్యాయి. సమన్వయ కమిటీ సమావేశం కూడా జరిగింది.
ఉమ్మడి మ్యానిఫెస్టోపై దాదాపు 3గంటలసేపు చర్చించామని సమావేశం తర్వాత పార్టీ నేతలుప్రకటించారు. సీనియర్ నేతలు యనమల, మనోహర్ వంటివారితో లోతైన చర్చలు జరిపామని… భవిష్యత్ ఎన్నికల్లో ఎలా కలసి వెళ్లాలి, సుస్థిర పాలనను ఎలా అందించాలి, ఎపి యువత, ఉద్యోగులు, రైతులకు ఎటువంటి పథకాలు ఉంటే బాగుంటుంది అనే అంశాలపై వివణాత్మకంగా చర్చించామన్నారు. జనసేన కూడా తమ ఆలోచనను తెలియజేసిందని…. రాబోయే వందరోజుల్లో ఉమ్మడి ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్తామని ప్రకటిచారు.
గతంలోలా మేనిఫెస్టోల్లో వందల హామీలు ఇచ్చే ట్రెండ్ పోయింది. కర్ణాటక ఎన్నికల నుంచి ప్రతీ కుటుంబానికి ఎంతో కొంత మేలు జరిగేలా పథకాలు ప్రవేశ పెట్టి గ్యారంటీ ఇవ్వడం ట్రెండ్ గా మారింది. కర్ణాటకలో కాంగ్రెస్ సక్సెస్ కావడంతో… టీడీపీ అదే బాట పట్టింది. తెలంగాణలోనూ కాంగ్రెస్ అదే ఊపుతో ముందుకు వెళ్తోంది. ఇప్పుడు జనసేన, టీడీపీ కూటమి కూడా అదే దశలో ముందుకు వెళ్తోంది.