అ.ఆ సినిమా బాగానే ఉంది గానీ, మీనా నవలను, సినిమానూ త్రివిక్రమ్ అక్షరాలా అనుకరించాడు అన్నది వెబ్ మీడియా లాగిన లా.. పాయింట్. వెబ్ మీడియా అనేంటి? మీనా సినిమాని చూసినవాళ్లూ, ఆ నవలను చదవిన వాళ్లు ఆ మాటే అన్నారు. మీనా తీసిన విజయ నిర్మలకు గానీ, మీనా నవల రాసిన యద్దనపూడికి గానీ ఒక్క థ్యాంక్స్ కూడా చెప్పలేదంటూ త్రివిక్రమ్‌ని వేలెత్తి చూపించారు. ఎట్టకేలకు త్రివిక్రమ్ కూడా నా సినిమాకి స్ఫూర్తి యద్దనపూడే.. అని ఒప్పుకొన్నారు. ఈ సినిమా తీసే ముందు ఆవిడను కలిసినట్టు అంగీకరించారు. థ్యాంక్స్ కార్డ్ దగ్గరకు వచ్చేసరికి త్రివిక్రమ్ లాంటి గొప్ప ‘మాటల’ రచయిత కూడా మాటల్లేక నీళ్లు నమలాల్సివచ్చింది. ‘థ్యాంక్స్ కార్డ్ వేశాం. టెక్నికల్ కారణాల వల్ల అది కనపడలేదు’ అన్న రేంజులో మాట్లాడారు.
సినిమాని బయటకు వదిలేముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొనే తత్వం త్రివిక్రమ్‌ది. టైటిల్ కార్డు విషయంలో బహు జాగ్రత్తగా ఉంటారు.ఎందుకంటే ప్రతీ పేరూ ఇంపార్టెంటే. అందుకే టైటిల్ కార్డు చెక్ చేసుకోకుండా సినిమాని వదిలేస్తారా అంటే నమ్మబుద్ది కాదు. యద్దనపూడినీ, మీనా నవలను, ఆ సినిమానీ ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు అని త్రివిక్రమ్ భావించి ఉండొచ్చు. కానీ వెబ్ మీడియా మాత్రం వదల్లేదు. దాదాపుగా త్రివిక్రమ్‌పై కాపీ ముద్ర వేసేంత పని చేసింది. దాంతో త్రివిక్రమ్ ఇప్పుడు కళ్లు తెరచి.. ఆ పేరు యాడ్ చేశాడు. దానికి టెక్నికల్ రీజన్ ని చూపించి.. తన తప్పు కాదంటున్నట్టు మాట్లాడుతున్నాడు. అదే.. ‘ఆ.ఆ’ సక్సెస్ మీట్లో పెద్ద జోకైపోయింది. `సినిమాలో కూడా ఇంత పెద్ద జోక్ లేదురా బాబు` అంటూ మీడియా వాళ్లు సెటైర్లు వేస్తున్నారు.