రాంగోపాల్ వర్మ – జొన్నవిత్తుల మధ్య ఆమధ్య గరం గరంగా భేటీలు సాగాయి. ఇద్దరూ ‘సై’ అంటూ కయ్యానికి కాలు దువ్వుకున్నారు. ఎవరినైనా ఇట్టే రెచ్చగొట్టేసే టాలెంట్ ఉన్న వర్మ – జొన్నవిత్తులను మీడియా సాక్షిగా ఓ ఆట ఆడుకున్నాడు. ‘వర్మ జోలికి వెళ్లడం ఎందుకులే’ అనుకునే ఈరోజుల్లో వర్మపై ఎర్రజెండా ఎగరేసి, నువ్వా? నేనా అంటూతలపడ్డాడు జొన్నవిత్తుల. అదే సమయంలో వర్మపై ఓ సినిమా తీస్తానని, అతని పైత్యం ఏపాటిదో ఈ జనానికి చెబుతానని ప్రతిన బూనారు జొన్నవిత్తుల. ఆ కోపాన్ని కేవలం మాటలతో సరిపెట్టలేదు. సినిమాకి కొబ్బరికాయ కూడా కొట్టేశారు. ఈ సినిమాకి ‘ఆర్జీవీ’ అనే పేరు కూడా పెట్టారు. నిజానికి ‘సైకో ఆర్టీవీ’ అనే టైటిల్ కోసం జొన్నవిత్తుల ప్రయత్నించారు. కానీ ఫిల్మ్‌ఛాంబర్ ఆ టైటిల్‌ని అనుమతించలేదు. దాంతో `ఆర్జీవీ`తో సరిపెట్టుకున్నారు జొన్నవిత్తుల. సమాజంలో కొంతమంది వ్యక్తులు స్వేచ్ఛ పేరుతో సమాజాన్ని ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో ఇందులో చెబుతానంటున్నారు జొన్నవిత్తుల. వర్మ వేషధారణకు సరిపోయే ఓ నటుడిని వెదికి పట్టుకోవడంలో బిజీగా ఉన్నారు జొన్నవిత్తుల. ఈ సినిమాకి ఆయనే కథ, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.