టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ప్రస్తుతం పరారీలో ( కొంచెం డిప్లమాటిక్ గా చెప్పాలంటే అజ్ఞాతంలో) ఉన్నాడు. ఆయన కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. 2 రోజుల క్రిందట రవి ప్రకాష్ ఫోర్జరీ కి పాల్పడ్డారని, పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారని, కొన్ని వార్త ఛానెల్స్ లో ప్రసారం చేసినప్పుడు టీవీ9 లో లైవ్ లోకి వచ్చిన రవి ప్రకాష్, తాను ఎక్కడికి పారిపోలేదని, తన గురించి ఇలా తప్పుడు వార్తలు ఇచ్చే ఛానెల్స్ “కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని”, అలాగే “నిజం చెప్పులేసుకునే లోపల అబద్ధం ప్రపంచమంతా చుట్టి వస్తుందని”, మీడియాకి లెక్చర్స్ ఇచ్చారు. అయితే మిగతా చానల్స్ ని బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి అని హితవు పలికిన రవి ప్రకాష్ గతంలో ( శ్రీజ ప్రేమ వ్యవహారం, టాలీవుడ్ డ్రగ్స్ కేసు, మహేష్ వివాహం, రవి తేజ తమ్ముడి మరణం తదితర సమయాల్లో) ఎంతవరకు బాధ్యతగా వ్యవహరించాడు అన్నది వేరే చర్చ.
Click here: చానళ్లను బాధ్యతాయుతంగా వ్యవహరించమన్న రవిప్రకాష్, గతంలో బాధ్యతగా వ్యవహరించాడా?
అయితే ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవికి పొలిటికల్ ఇన్ పుట్స్ ఇవ్వడంలో సహాయపడ్డ జర్నలిస్టు అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పట్ల, చిరంజీవి పట్ల రవి ప్రకాష్ వ్యవహరించిన తీరును నెమరు వేసుకుంటూ కొత్త విషయాలను వెలుగులోకి తీసుకుని వచ్చారు. ప్రముఖంగా రెండు సంఘటనలను ప్రస్తావిస్తూ ఆయన విడుదల చేసిన డాక్యుమెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చిరంజీవి విషయంలో, “నిజం చెప్పులేసుకునేలోగా ప్రపంచం అంతా అబద్ధం చుట్టి వచ్చేలా” రవిప్రకాష్ చేశాడా ??
2009 డిసెంబర్ ప్రాంతంలో, చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది నెలల తర్వాత జరిగిన సంఘటన ఇది. అప్పట్లో చిరంజీవి తరపున తిరుపతిలో కోఆర్డినేటర్గా మాజీ ఐఏఎస్ వరప్రసాద్ ( ఆ తర్వాత ఎలా వైఎస్సార్సీపీలో చేరిన తిరుపతి ఎంపిగా కూడా గెలిచాడు) ఉండేవాడు. ఆయన రోజువారి అప్డేట్స్ చిరంజీవికి పంపడం, చిరంజీవి వాటిని సమీక్షించి రోజు ఆయనతో ఫోన్లో మాట్లాడడం, ప్రతి 20 రోజులకు ఒకసారి తిరుపతి పర్యటించడం చేసేవాడు. అయితే అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా తన పర్యటన వాయిదా పడింది. అలాగే శీతాకాలంలో ఒకసారి చిరంజీవి తిరుపతి వెళ్లాల్సిన పర్యటన శంషాబాద్ లో పొగమంచు కారణంగా ఫ్లైట్ క్యాన్సిల్ అయి వాయిదా పడింది. దీంతో చిరంజీవి తిరుపతి వెళ్లి 30 రోజులు దాటిపోయింది. ఇంతలోనే టీవీ9 లో పది గంటల బులిటెన్లో, “చిరంజీవి కనిపించుట లేదు” అంటూ టీవీ9 ఒక పెద్ద కథనాన్ని ప్రసారం చేసింది. చిరంజీవి ని ఎన్నుకుని తప్పు చేశాము అంటూ ఒక పది మంది యువకులు వ్యాఖ్యానించడం, ప్లకార్డులు చూపించడం, చిరంజీవి మీద పోలీసు కేసు పెట్టబోతున్నామంటూ వారు వ్యాఖ్యానించడం ఆ కథనం సారాంశం. చిరంజీవి కనిపిస్తే తిరుపతిలో ప్రజలు తిరగబడేలా ఉన్నారు అంటూ ఆ కథనంలో వ్యాఖ్యానించారు. అయితే చిరంజీవి వెంటనే తిరుపతి పర్యటన కి వెళ్లగా, ఎప్పట్లాగే వేల మంది అభిమానులు చిరంజీవిని కలుసుకోవడానికి వచ్చారు. టీవీ9 లో నేమో చిరంజీవి కనిపిస్తే ప్రజలు తిరగబడతారు అంటూ కథనాలు. అయితే తర్వాత ప్రజారాజ్యం పార్టీ వారి విచారణలో తేలింది ఏమిటంటే, వేరే ప్రాంతాల నుండి వచ్చి ఎస్వీ యూనివర్సిటీలో చదువుకుంటున్న కొంతమంది విద్యార్థులకు, టీవీ9 వాళ్లే ఎలా మాట్లాడాలో తర్ఫీదు ఇచ్చి, టీవీ9 వాళ్లే తయారు చేయించి ఇచ్చిన ప్లకార్డులు పట్టించి ఆ వార్తాకథనాన్ని వండారు. ఆ రకంగా- చిరంజీవి తిరుపతి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి, నియోజకవర్గ పనుల విషయం లో మెరుగ్గా కష్టపడ్డాడు అన్న నిజం చెప్పు చేసుకునేలోగా, “చిరంజీవి కనిపించడం లేదని తిరుపతి స్థానికులు కేసులు పెడుతున్నారు” అన్న అబద్ధం ప్రపంచమంతా చుట్టి వచ్చేలా రవి ప్రకాష్ వార్తను వండాడు అని ఆ జర్నలిస్టు వివరించారు. అప్పట్లో చిరంజీవి పర్యటనలు అన్నింటిలోనూ తాను చిరంజీవి తో పాటే ఉండేవాడినని ఆయన గుర్తు చేశారు.
అతిథిగా టీవీ9 కు చిరంజీవి ని పిలిపించి, కనీస మర్యాద చేయని వైనం:
ఇదే జర్నలిస్టు ఆ డాక్యుమెంట్ లో మరొక సంఘటనను కూడా ప్రస్తావించాడు. చిరంజీవి కేంద్రమంత్రి అయిన కొత్తలో, ఆయనను ఇంటర్వ్యూ ఇవ్వమని అనేక చానల్స్ ప్రతిపాదనలు పంపగా, చిరంజీవి అన్ని చానల్స్ కు వెళ్లి ఇంటర్వ్యూలు ఇచ్చి వచ్చాడు. అయితే ఏ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళినా, ఏబీఎన్ రాధాకృష్ణ కానీ, ఎన్టీవీ చౌదరి కానీ, టీవీ5 నాయుడు కానీ, చిరంజీవి వారి కార్యాలయానికి చేరుకోగానే చిరంజీవికి స్వయంగా ఆహ్వానం పలికారు. కానీ టీవీ9 విషయానికి వస్తే, చిరంజీవి కి ఎవరు ఆహ్వానం పలకకపోగా చిరంజీవి ఇంటర్వ్యూ మొత్తం ఇచ్చి తిరిగి వెళ్లిపోయేటప్పుడు, ఎవరో వచ్చి, “సార్, పై ఫ్లోర్ లో రవి ప్రకాష్ గారు ఉన్నారు మిమ్మల్ని రమ్మంటున్నారు” అని చెప్పారట. సరేనని చిరంజీవి తానే పై ఫ్లోర్ కి వెళ్లి రవి ప్రకాష్ ను కలిసి మాట్లాడి తిరిగి వచ్చేశారట. చిరంజీవి కేంద్రమంత్రి అనో, మెగాస్టార్ అనో కాకపోయినా, కనీసం ఒక గెస్ట్ గా చిరంజీవి ని తామే పిలిపించినప్పుడు, అదే కార్యాలయం లో ఉండి కూడా ఆహ్వానించక పోగా, తనకు తానుగా వచ్చి కలవకుండా వేరే వాళ్ళతో రమ్మని పిలిపించుకోవడం ద్వారా కనీస మర్యాద కూడా రవి ప్రకాష్ ఇవ్వని వైనాన్ని ఆ జర్నలిస్ట్ గుర్తు చేసుకున్నాడు.
మొత్తం మీద:
ప్రజారాజ్యం సమయంలో రవి ప్రకాష్ వ్యవహరించిన తీరు ప్రజలకు కూడా చాలామందికి గుర్తుంది. అయితే రవి ప్రకాష్ ని ఆ సమయంలో దగ్గర నుంచి చూసిన జర్నలిస్టులు ఇప్పుడు ఒక్కొక్కటిగా అప్పటి సంఘటనలను బయట పెడుతున్నారు. ఈ సంఘటనలు బయటకు వస్తున్న కొద్దీ, రవి ప్రకాశ్ వ్యక్తిత్వం మరింతగా మసకబారుతున్న ట్లు కనిపిస్తుంది.
– జురాన్ (@CriticZuran)