1989 ఐఐఎస్ బ్యాచ్ కు చెందిన ఎస్ వేంకటేశ్వర్ సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్గా ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు.
ఆయన రాకతో సమాచార శాఖ పనితీరులో మార్పు వచ్చే అవకాశం ఉంది. వెంకటేశ్వర్ గత 25 సంవత్సరాలుగా సమాచారం ప్రజలకు చేరవేయడంలో రకరకాల కుస్తీలు పట్టి రాటు దేలిన జర్నలిస్టు. చాలా కాలం తర్వాత, ఆంధ్రప్రదేశ్ సమాచారం శాఖ ప్రొఫెషనల్ చేతిలోకి వస్తూ ఉంది. ఇదొక మంచి పరిణామం. ఇంత వరకు చాలా మంది సమర్థవంతులయిన అధికారులే ఈ సమాచార శాఖ కమిషనర్ బాధ్యతలు నిర్వర్తించినా, వాళ్లకి, వేంకటేశ్కి తేడా, వెంకటేశ్ వార్తావాహకుడు, వాళ్లంతా వార్తల చాటు వ్యక్తులు. వార్తను సమాచార గుళికగా మార్చగలిగన సత్తా తెలిసిన వ్యక్తి వేంకటేశ్వర్.వాళ్లని వేంకటేశ్వర్ని పోల్చడం కుదరదు కూడా.
నిజానికి వేంకటేశ్వర్ బాధ్యతలు స్వీకరించిన కాలం ఆయన నేర్పరి తనానికి ఒక పరీక్ష లాంటిదే . ఎందుకంటే, సమాచారాన్ని రాజకీయ పరివర్తన సాధనంగా, ఆయుధంగా వాడుకోవాలనుకునే ముఖ్యమంత్రిని వేంటకేశ్వర్ మెప్పించాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడ ఎపుడు అధికారంలో ఉన్నా ఆయన మీద సమాచార ముప్పేట దాడి జరగుతూ నే ఉంటుంది. ఇపుడయితే, ప్రతిపక్ష పార్టీలు రాజధానిఅమరావతి మీదో , పోలవరమనో, రుణమాఫి చాల లేదనో, పట్టిసీమ ప్రత్యేక హోదా అనో ఎన్నో రకాలుగా దాడి సాగిస్తున్న తరుణంలో వేంకటేశ్వర్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించాలి. సమాచార ప్రసారానికి చంద్రబాబునాయుడు ఇచ్చినంత ప్రాముఖ్యం మరొక ముఖ్యంత్రి ఇవ్వడం మనకు తెలియదు. అందువల్ల ఎంత ఒడుపుగా మీడియాను మచ్చిక చేసుకుని రుచీపచీ లేని ప్రెస్నోట్లను ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే సాధానలుగా మార్చగలగడం మీద వేంకటేశ్వర్ జయాపజయాలు అధార పడి ఉంటాయి. ఆయన ఇంతవరకు నిర్వర్తించిన బాధ్యతలొకరకమయితే, ఇపుడు మీదేసుకున్న బరువు మరొక రకం. ఇక్కడ ప్రతి ఘడియా ఆయనొక పరీక్షా సమయమే.
ప్రభుత్వ పథకాల గురించి, ప్రాజక్టుల గురించి ప్రజలలో ఉన్న అపోహలను తొలగించి వాళ్ల ధోరణిలో మార్పు తీసుకువచ్చేందుకు సమాచారశాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు ధీటుగా ఆయన తీర్దిదిద్దాలి. మీడియా అంత తొందరగా మచ్చికయ్యే ప్రాణి కాదు. వేంకటేశ్వర్ ఎలా పనిచేస్తారో చూద్దాం. దీనిని మచ్చిక చేసుకోవాలి, అదేసమయంలో ప్రతిపక్షాల దాడి నుంచి ప్రజలచుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పాటు చేసి ప్రభుత్వం , ముఖ్యమంత్రి తప్ప మరొకరెవరూ ప్రజలకు కనిపించకుండా సమాచార మాయలు కూడా చేయాలి.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోభౌతిక శా స్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వెంకటేశ్వర్ కేంద్ర సమాచారం శాఖలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో చేరడానికి ముందు ఆయన బెంగళూరులోని పిఐబిలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా పని చేశారు. అంతకు ముందు కలకత్తా ఆకాశ వాణి వార్త విభాగలో డైరెక్టర్గా పని చేశారు. అంతకు ముందు ఆయన ఒడీషా పిఐబిలోడైరెక్టర్ గా పని చేశారు. ఇటీవల ముగిసిన గోవా అంతర్జాతీయ ఫల్మోత్సవాలలో ప్రజాసంబంధాల బాధ్యుడిగా పని చేశారు. ఆయన కేంద్రం నుంచి డిప్యుటేషన్ మీద రాష్ట్రానికి వచ్చారు.