ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగంలో… మీడియాను టార్గెట్ చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లను మాత్రమే ప్రత్యేకంగా ప్రస్తావించి… కాంట్రాక్టుల గురించి వక్రీకరించి రాస్తే… పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరించారు. ఈ మూడు మాత్రమే… జగన్ మోహన్ రెడ్డికి సమర్ధనగా వార్తలు రాయలేదనే కోపంతో.. అలా ప్రకటించి ఉండవచ్చు కానీ.. అసలు కథనాలు రాస్తే… పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరించడమే… విచిత్రం. ఎందుకంటే..జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక సాక్షి … తెలుగుదేశం పార్టీ నేతలపై మాత్రమే కాదు.. జగన్మోహన్ రెడ్డి ఆగ్రహించిన ప్రతీ ఒక్కరిపైనా.. ఎన్నెన్ని కథనాలు ప్రచురించి.. ప్రసారం చేసిందో… చాలా మందికి తెలుసు.
వేల కోట్లు సంపాదించారన్న సాక్షి కథనాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ఏం కేసులు పెట్టాలి..?
ఎన్నికలకు ఆరు నెలల ముందుగా.. సాక్షి మీడియా.. టీడీపీ నేతలపై… వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కథనాలు ప్రచురించింది. ఒక్కొక్క ఎమ్మెల్యేని.. టార్గెట్ చేసుకుని ఐదేళ్లలో.. కనీసం ఒక్కొక్కరు వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించారని నియోజకవర్గాల వారీగా పేజీలకు పేజీలు రాశారు. అవన్నీ చూసి.. టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. కొంతమంది సాక్షి ఆఫీసుల ముందు ధర్నాలు చేశారు. కానీ వారిది కంఠశోషే అయింది. సాక్షి దినపత్రిక కథనాల లక్ష్యం… వారిపై అవినీతి ముద్ర వేయడం. అనుకున్నది సాధించారు. రిజర్వుడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలనూ వదిలి పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం చూస్తే.. ఆ కథనాలపై టీడీపీ నేతలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..?
అసలు అనని మాటలను అన్నట్లు ప్రసారం చేస్తే బ్యాన్ చేయాలి కదా..?
ఆరోపణలు చేస్తూ రాసిన కథనాలు ఒకెత్తు అయితే .. అసలు పూర్తిగా జరగని వాటిని జరిగినట్లు.. అనని మాటలను అన్నట్లుగా ప్రచురించిన.. ప్రసారం చేసిన కథనాలకు లెక్కేలేదు. చివరికి టీడీపీ ఓడిపోయిన తర్వాత కూడా.. టీడీపీ కార్యకర్తలను లోకేష్ తిట్టాడంటూ.. బ్రేకింగులు వేసి హడావుడి చేశారు. అసలు లోకేష్ పాల్గొనని కార్యక్రమంలో.. ఆయన పేరుతోనే నేరుగా.. అలాంటి వార్తలు ప్రసారం చేసి.. అంతా తెలిసిన తర్వాత కూడా.. కనీసం వివరణ కూడా ఇవ్వని.. సాక్షి పత్రిక, టీవీపై…ఎలాంటి చర్యలు తీసుకోవాలి…?. ఒక్క లోకేష్ విషయంలోనే… గత ఐదేళ్ల కాలంలో.. సాక్షి పత్రిక.. ప్రభుత్వంపై ఎన్నో కథనాలు ప్రచురించింది. వాటిలో 90శాతం అభూతకల్పనమే. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది..?
మీడియా ఎవరికీ తొత్తు కాదు..!
మీడియా విషయంలో కొత్త ముఖ్యమంత్రి… కాస్త అసహనంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. మీడియా పని ప్రభుత్వాలకు బాకా ఊదడం కాదు. కొన్ని మీడియా సంస్థలు.. అలా చేస్తాయేమో కానీ.. అన్నీ అలా చేయాలనుకోవడం…ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. మీడియా ఏదైనా ఆరోపణ చేసినప్పుడు.. నిజాలు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేయాలి కానీ… ఆ మీడియాపై.. రాజకీయ ముద్రనో.. కులం ముద్రనో వేసి.. మసిపూసి మారేడు కాయ చేయడం… కేసులు వేస్తామని భయపెట్టడం… ప్రజాస్వామ్యంలో మంచిది కాదు.