ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వంలో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఇప్పటివరకు విచారణలో తేలగా తాజాగా జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు తేలింది. ఈమేరకు విచారణ అధికారులు జర్నలిస్టులకు సమాచారం అందించారు. ఏకంగా 36 మంది జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఫోన్ ట్యాప్ కు గురైన జర్నలిస్టులకు ఫోన్లు చేసి పోలీసులు అసలు విషయం చెప్పడంతో వారంతా షాక్ అయ్యారు. గతేదాది మార్చి నుంచి అక్టోబర్ వరకు జర్నలిస్టుల కాల్ డేటా గురించి పోలీసులు క్షుణ్ణంగా వివరించడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారని సమాచారం. పోలిసుల సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఆఫీసుకు వెళ్ళిన కొంతమంది జర్నలిస్టులు తమ ఫోన్లు నిజంగానే ట్యాప్ అయ్యాయా..? అని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరెవరితో ఎక్కడ మాట్లాడారు..? ఎంతసేపు మాట్లాడారు..? ఎక్కడెక్కడ ప్రయాణించారు..? అనే విషయాలను పోలీసులు స్పష్టంగా వివరించడంతో జర్నలిస్టులు తమ ఫోన్లు నిజంగానే ట్యాప్ అయ్యాయని నిర్ధారణకు వచ్చారు. అయితే, ఫోన్ ట్యాపింగ్ కు గురైన జర్నలిస్టులలో ఎవరికైనా నాటి ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి వేధింపులు ఎదురయ్యాయా..?అని జర్నలిస్టులను అడిగి తెలుసుకుంటున్నారు.
ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు వినియోగించుకోవాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం కాంగ్రెస్ బీట్ చూసే జర్నలిస్టులను టార్గెట్ చేసి వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులే కాకుండా పత్రికల్లో పని చేసే జర్నలిస్టులపై కూడా నిఘా పెట్టారని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కు గురైన జర్నలిస్టులను పిలిచి…ఈ అంశంపై మీద ఫిర్యాదు చేయాలనుకుంటే దర్యాప్తు చేపడుతామని పోలీసులు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.