బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారాన్ని వీలైనంతగా రాజకీయం చేసే ప్రయ.త్నంలో బీజేపీ రెండో రోజు కూడా సక్సెస్ అయింది. ఉదయం నుంచి కేంద్రమంత్రులు రాక… బండి సంజయ్‌తో ములాఖత్ వ్యవహారం నడపగా.. సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా షో నడిపారు. ఆయన బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా శాంతియుత ప్రదర్శన చేయాలనుకున్నారు. కానీ పోలీసులు ఉదయం నుంచి అనుమతి లేదని… రాగానే ఆయనను అదుపులోకి తీసుకుంటామని లీకులు ఇచ్చారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది.
జేపీ నడ్డా ఎయిర్‌పోర్టుకు వచ్చిన తర్వాత చాలా సేపు అందులోనే ఉండిపోయారు . తర్వాత పోలీసులు అనుమతి ఇచ్చారు. కరోనా నిబంధనల ప్రకారం శాంతియుత ర్యాలీ నిర్వహించాలని చెప్పారు. ఆ ప్రకారం సికింద్రాబాద్‌లో ర్యాలీ నిర్వహించి బీజేపీ ఆఫీసుకు వెళ్లిపోయి అక్కడ మీడియాతో మాట్లాడారు . టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యోగులకు మద్దతు ఇవ్వడానికే వచ్చామని.. ఎన్ని దాడులు చేసినా పోరాడతామని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే.. బండి సంజయ్ దీక్షపై అంత సీరియస్‌గా పోలీసులు ఎందుకు తీసుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు… కానీ బీజేపీకి మాత్రం ఈ అంశం బాగా కలసి వచ్చింది.
బండి సంజయ్‌కు బెయిల్ లభించకపోవడే అడ్వాంటేజ్‌గా మారింది. ఆయనకు ఫద్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో ఆ పధ్నాలుగు రోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఈ పరిస్థితి చూసి కాంగ్రెస్ మండి పడుతోంది. బీజేపీని ప్రతిపక్ష పార్టీగా చూపించేందుకు టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో పొలిటికల్ గేమ్ ఎవరికీ అర్థం కాని రీతిలో సాగుతోంది.