పొత్తులపై ఇక బీజేపీ నేతలు ఏమీ మాట్లాడవద్దని జేపీ నడ్డా ఆదేశించినట్లుగా తెలుస్తోంది. తమతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్ ఒంటరి పోటీ… అలాగే టీడీపీతో పాటు బీజేపీ కలిసి పోటీ చేసే ఆప్షన్లను కూడా ఇవ్వడంతో బీజేపీ నేతలు దూకుడుగా స్పందించారు. విష్ణువర్దన్ రెడ్డి, సత్యకుమార్ సహా అనేక మంది నేతలు..పవన్ ను తప్పు పట్టేలా మాట్లాడారు. అసలు తాము ఇతరులతో పొత్తులెందుకు పెట్టుకుంటామని.. ఇతరులు వస్తే తామే సీట్లిస్తామన్నారు.
అదే సమయంలో పవన్ కల్యాణ్ ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా… ఎవరినో సీఎం చేయడానికి బీజేపీ ప్రయత్నించదని తేల్చి చెప్పారు. ఇవన్నీ బీజేపీలో ప్రో వైసీపీ అని పేరున్న నేతలు చేయడంతో వివాదాస్పదమయింది. ఇతర నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. పొత్తులో ఉన్న జనసేనను వారు ఇన్సల్ట్ చేశారని.. వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారన్న అభిప్రాయాన్నివ్యక్తం చేశారు. నడ్డా అక్కడే ఇక పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లుగా తెలుస్తోంది.
అయితే బీజేపీ నేతలు ఓ మిషన్ పని చేస్తున్నట్లుగా పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. సంబంధం లేకపోయినా.. టీడీపీ ని లాగి కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. నడ్డా ఉన్నంత వరకూ సైలెంట్ గా ఉన్న వెళ్లిపోయిన తర్వాత మళ్లీ తమ మిషన్ ప్రారంభిస్తారన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది.