అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తే ఎన్టీఆర్‌ను విందుకు పిలిచారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురంభీం పర్పార్మెన్స్ను మెచ్చి ఆయనను షా విందుకు పిలిచారని చెప్పుకున్నారు. అక్కడ రాజకీయాలు మాట్లాడుకున్నారా లేదా అన్నదానిపై ఇప్పటికీ హైవోల్టేజ్ చర్చలు జరుగుతున్నాయి. ఈ సారి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు వస్తున్నారు. హన్మకొండలో జరగబోయే బహిరంగసభలో ప్రసంగించేందుకు ఆయన వస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి టాలీవుడ్లో నిలదొక్కుకున్న హీరో నితిన్‌తో భేటీ కావాలనుకున్నారు.
ఈ మేరకు సమాచారం పంపారు. నితిన్‌తో భేటీకి … చెప్పుకోవడానికి కారణం లేదు. మాచర్ల నియోజకవర్గం సినిమా చూసి … ఆయనను ప్రశంసించడానికి పిలిచారని చెప్పుకునే పరిస్థితి లేదు. కేవలం.. నితిన్‌తో భేటీ అవడం ద్వారా.. ఆయన బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారన్న ఓ అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపడానికి ప్రయత్నిస్తారు. అలాగే టాలీవుడ్‌కు చెందిన కొంత మంది ప్రముఖ రచయితలు… నటులతోనూ నడ్డా సమావేశం అయ్యే అవకాశం ఉంది.
ఇటీవల టాలీవుడ్ నుంచి విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ సభ్యత్వం రావడంతో ఆయన ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారేమోకానీ.. టాలీవుడ్ మొత్తం బీజేపీ వైపు ఉందని చెప్పడానికి వేస్తున్న స్కెచ్‌లా ఈ వ్యవహారం ఉందన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి.