ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలోపేతం చేయాలనుకుంటున్న అమిత్ షా.. జేపీ నడ్డాకే.. పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ విషయాన్ని తాను డీల్ చేస్తున్నప్పటికీ.. ఏపీ విషయాన్ని మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాకే అప్పగించారు. ఆయన తరచరూ.. ఏపీ విషయంలపై సమీక్ష చేస్తున్నారు. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతలను ఢిల్లీ పిలిపించి కండువా కప్పి అభయం ఇచ్చి పంపుతున్నారు. ఇప్పుడు నేరుగా ఏపీలోకి అడుగు పెడుతున్నారు. పదో తేదీన ఆయన విజయవాడలో రోజంతా.. కీలకమైన సమావేశాలు ఏర్పాటు చేశారు. బూత్ కమిటీ సభ్యులు, ముఖ్యనాయకులతో ఆయన సమావేశవుతారు. పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలు… ఇతర బాధ్యతలను నేతలకు అప్పగిస్తారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతాపార్టీని బలమైన పార్టీగా రూపుదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఆ పార్టీ అగ్రనేతలు. రాష్ట్రంలో పార్టీకి బలం లేకున్నా… కేంద్రంలో అధికారంలో ఉండటం.. మోదీ, అమిత్ షా ల రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. మోదీ పిలుపుతో గాందీజీ సంకల్పయాత్రను వివిధ ప్రాంతాలలో బీజేపీ నేతలు నిర్వహించారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలలో ఇంటింటికీ తిరుగుతూ.. కేంద్ర పధకాలను ప్రచారం చేశారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను కూడా వివరించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మార్చుకునేలా పావులు కదుపుతున్నారు.
ఇతర పార్టీల నుంచి వచ్చే అనేక మంది నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా జనాల్లో కూడా బీజేపీపై ఒక నమ్మకం కల్గించాలని అగ్రనేతలు భావిస్తున్నారు. గాంధీ సంకల్పయాత్ర ద్వారా బీజేపీ ప్రజలకు చేరువ అయ్యామని.. భవిష్యత్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాదరణ పొందుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా… బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. ఇటీవల టీడీపీ నుంచి బీజేపీ లో చేరిన నేతలే.. క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.