భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా బాధ్యతలు స్వీకరించారు. నడ్డాకి పోటీగా ఎవ్వరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో.. అధ్యక్షుడిగా ఆయన్ని ఎన్నుకున్నట్టు భాజపా ప్రకటించింది. నిజానికి, నడ్డాకి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారన్నది కొత్త విషయమేం కాదు. కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించిన తరువాతి నుంచి ఆయన పేరే ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. పార్టీలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాల తరువాత మూడో స్థానంలో కీలక నేతగా నడ్డా నిలుస్తూ వచ్చారు.
గత ఏడాది లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే నడ్డాని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అమిత్ షా నియమించారు. అప్పట్నుంచీ పార్టీలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి భాజపాలో చేరే నాయకులను ఆహ్వానించడం, పార్టీలో చేర్చుకోవడం దాదాపుగా ఆయన సమక్షంలోనూ జరుగుతూ వచ్చాయి. మోడీ షా ద్వయానికి నమ్మకస్తుడిగా నడ్డాకి మంచి పేరే ఉంది. దీంతో అధ్యక్ష బాధ్యతల స్వీకరణ లాంఛనమే అయింది.
కొత్త బాధ్యతలు స్వీకరిస్తున్న నడ్డా ముందు కొన్ని సవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. అప్రతిహతంగా సాగుతూ వచ్చిన భాజపా విజయాలకు ఈ మధ్య కొన్ని బ్రేకులు పడుతున్నాయి. దీన్ని ట్రాక్ లో పెట్టాలి. మరీ ముఖ్యంగా ఢిల్లీలో శాసన సభ ఎన్నికలున్నాయి. అక్కడ పార్టీని అధికారంలోకి తేవడానికి నడ్డా గట్టిగానే శ్రమించాల్సిన పరిస్థితి. భాజపా ఢిల్లీలో పాగ వేయగలిగితే… నడ్డా హయాం మంచి విజయమౌతుంది. ఆ తరువాత, బీహార్లో కూడా ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే ఏడాదిలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. బెంగాల్ లో పట్టు సాధించాలన్నది భాజపా బలమైన లక్ష్యం. గడచిన లోక్ సభ ఎన్నికల్లో మమతా బెనర్జీతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోటీ పడ్డారు. అక్కడ భాజపా గెలుపునకి ప్రతిష్టాత్మకంగానే ప్రయత్నించాల్సి ఉంటుంది. దీంతోపాటు, మరో సవాలు… ఇంకా చెప్పాలంటే అసలైన సవాలు… ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడిగా గతంలో అమిత్ షా వ్యవహరించినంత స్వేచ్ఛ నడ్డాకి ఉంటుందా అనేది..? అధ్యక్ష హోదాలో కొన్ని రాష్ట్రాల్లో అమిత్ షా ఏ తరహా రాజకీయ చదరంగాన్ని నడిపారో తెలిసిందే. ఆ తరహా వ్యూహాలు నడ్డా దగ్గర ఉన్నాయా… లేదంటే, మోడీ షా ద్వయం ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించే మంచి అనుచర అధ్యక్షుడిగా పేరు తెచ్చుకుంటారా అనేది వేచి చూడాలి.