తెలంగాణ బీజేపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. ఎంతగా అంటే కనీసం పార్టీ సభ్యత్వ నమోదునూ ఎవరూ పట్టించుకోవడం లేదు. జాతీయ స్థాయిలో బీజేపీ సభ్యత్వ నమోదును సెప్టెంబర్ 8వ తేదీన ప్రారంభించారు. తెలంగాణకు యాభై లక్షల సభ్యత్వాల టార్గెట్ పెట్టారు. ఓపెనింగే చాలా నీరసంగా ఉంది. ఇరవై రోజుల పాటు కనీసం ఏడు లక్షల సభ్యత్వాలనూ నమోదు చేయించలేకపోయారు. దీంతో కంగారు పడిన పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హడావుడిగా తెలంగాణకు వచ్చారు.
కొన్నాళ్లుగా తెలంగాణ బీజేపీలో కదలికల్లేవు. కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ బీజేపీలో స్తబ్దత పెరిగిపోయింది. ఆయనకు వేరే బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. సీనియర్లు పెరిగిపోవడంతో పాటు ఎవరి మధ్య సఖ్యత లేకపోవడంతో పార్టీ కార్యకలాపాలు కూడా ఆగిపోయాయి. కీలక అంశాల్లో ఎవరి దారి వారిదే. హైడ్రాను మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యతిరేకిస్తుంటే మెదక్ ఎంపీ రఘునందనరావు, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి సమర్థిస్తున్నారు. ఇలా ఓ స్టాండ్ తీసుకోలేకపోవడం కూడా సమస్యగా మారింది.
ముందుగా ఓ పార్టీ అధ్యక్షుడిని నియమిస్తే అంతా సర్దుకుంటుదని అనుకుంటున్నారు. కానీ ఆ నియామకమే పెద్ద సమస్యగా మారింది. పలుమార్లు సీనియర్ నేతలు వచ్చి దారికి తెచ్చే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఓ వైపు చేతిలోకి వచ్చిన అవకాశాల్ని చేజార్చుకుంటున్నామని హైకమాండ్ బాధపడిపోతోంది. కానీ సరైన నిర్ణయాలు తీసుకోలక.. నాన్చుతూ పోతోంది. ఫలితంగా బీజేపీకి కోలుకునే అవకాశాలు రావడం లేదు.